కారు ప్రమాదంలో వర్థమాన నటుడు మృతి.. మృత్యువుతో పోరాడుతున్న భార్య..
తమిళ నటుడు, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు మనో కారు ప్రమాదంలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. అక్టోబర్ 28న చెన్నై పట్టణానికి సమీపంలో జిరిగిన రోడ్డు ప్రమాదంలో తుదిశ్వాస విడిచారు. ఈ దుర్ఘటనలో మనో భార్య కూడా మృత్యువుతో పోరాడుతున్నది. మనో ఆకస్మిక మరణంతో కోలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పలువురు సోషల్ మీడియాలో తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు..

దీపావళీ రోజునే విషాదం
దీపావళీ రోజున కుటుంబ కార్యక్రమం కోసం భార్యతో కలిసి వెళ్తుండగా చెన్నైలోని మీడియన్ రోడ్డులో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకొన్నది. యాక్సిడెంట్ జరిగినప్పుడు భార్య, మనో మాత్రమే కారులో ఉన్నారు. మీడియన్ రోడ్డులో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో వారిద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారని, మనోకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనాస్థలంలో మృతి చెందినట్టు బంధువులు తెలిపారు.

మృత్యువును ఎదురిస్తూ..
ప్రమాదంలో గాయపడి మృత్యువుతో పోరాడుతున్న మనో భార్యను స్థానిక రామచంద్ర హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్సను అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్టు తెలిసింది. మనో దంపతులకు ఏడేళ్ల కూతురు ఉంది.

జీర్ణించుకోలేకపోతున్న సన్నిహితులు, స్నేహితులు
సినీ పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదుగుతున్న మనో మృతి పలువురిని షాక్ గురిచేసింది. స్నేహితులు, సన్నిహితులు ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. తమిళ పీఆర్వో జాన్ ట్వీట్ ద్వారా మనో మృతిని ధృవీకరించారు. మల్టీ టాలెంటెడ్ యాక్టర్ మనో అవది సమీపంలో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆయన భార్య రామచంద్ర హాస్పిటల్‌లోని ఐసీయూలో ఉన్నారు. ఈ వార్త విని షాక్ గురయ్యాను అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

మనో కెరీర్ ఇలా..
ఇక మనో కెరీర్ విషయానికి వస్తే.. ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో హోస్ట్‌గా ప్రొఫెషనల్ జీవితాన్ని ప్రారంభించారు. పలు రియాలిటీ షోలలో ఆయన తన మిమిక్రీ, డ్యాన్సింగ్ టాలెంట్‌తో అభిమానులను సంపాదించుకొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది ప్రదర్శనలతో మంచి మిమిక్రీ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకొన్నారు.తమిళంలో పుజల్, మాన్నద మేయిలాదా చిత్రాలు మనోకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.


Click it and Unblock the Notifications











