శ్రీవారిపైనే పేరడీ.. వివాదంలో స్టార్ హీరో, ప్రతి కుక్కకు ఆన్సర్ ఇవ్వనంటూ వార్నింగ్
టాలీవుడ్ టూ కోలీవుడ్‌లలో కమెడియన్ రేంజ్ నుంచి హీరోగా మారిన వారు ఎందరో ఉన్నారు. తెలుగులో రాజబాబు నుంచి వెన్నెల కిషోర్ వరకు ఎందరో కమెడియన్లు.. హీరోలుగానూ తమ అదృష్టం పరీక్షించుకున్నారు. వీరిలో కొందరు సక్సెస్ అవ్వగా.. మరికొందరు చేతులు కాల్చుకున్నారు. ఇంకొందరు మాత్రం కమెడియన్‌గా ఉంటూనే అప్పుడప్పుడు హీరోగా అదరగొడుతున్నారు. ఇక మనకి పక్కనే ఉన్న కోలీవుడ్‌లోనూ కొందరు కమెడియన్లు .. హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వీరిలో సంతానం కూడా ఒకరు.
మన్మథన్ సినిమాతో బ్రేక్
తమిళనాట స్టార్ కమెడియన్లుగా వెలుగొందిన వడివేలు, వివేక్ వంటి వారి తర్వాత ఈ జనరేషన్‌లో స్టార్ కమెడియన్స్ అనిపించుకున్నారు యోగి బాబు, సంతానం. వీరిద్దరిలో సంతానంది డిఫరెంట్ స్టైల్. 2002లో ప్రసాద కన్నుం పెసుమె సినిమాలో విక్రమ్ క్లాస్‌మెట్‌గా నటించిన సంతానం పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అయితే 2004లో శింబు హీరోగా వచ్చిన మన్మథన్ సినిమాతో బ్రేక్ అందుకున్నారు సంతానం. నాటి నుంచి తనమార్క్ కామెడీతో స్టార్ కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చారు. స్టార్ హీరోల సినిమాలో నటిస్తూ బిజీగా మారారు.

హీరోగా చేస్తూనే కమెడియన్‌గానూ
ప్రస్తుతం హీరోగానూ బిజీ అయ్యిన సంతానం.. తనలోని కమెడియన్‌ని మాత్రం విడిచిపెట్టలేదు. మధ్య మధ్యలో కమెడియన్‌గా చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది మదగజరాజాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ప్రస్తుతం ఆయన హీరోగా తెరకెక్కిన డీడీ నెక్ట్స్ లెవల్ సినిమా మే 16న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సంతానం సరసన గీతికా తివారీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సెల్వ రాఘవన్, గౌతం మీనన్, కస్తూరి, యాషిక ఆనంద్, రాజేంద్రన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తుండగా.. ది షో పీపుల్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి, ఆర్య నిర్మిస్తున్నారు. ప్రేమ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఓఫ్రో స్వరాలు సమకూర్చారు.
తిరుమల శ్రీవారిపై పేరడీ సాంగ్
సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడటంతో డీడీ నెక్ట్స్ లెవల్ టీమ్ ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేసింది. ఇటీవల ఈ సినిమాలోని ఓ సాంగ్‌లో తిరుమల శ్రీవారికి సంబంధించిన గోవింద నామాలు ఉపయోగించడం వివాదాస్పదమైంది. పార్కింగ్ డబ్బులు గోవిందా.. పాప్‌కార్న్ ట్యాక్స్ గోవిందా అంటూ సాగే ఈ పాట బాగానే పాపులర్ అయ్యింది. అయితే దీనిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. తిరుమల శ్రీవారిపై పేరడీ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ హిందూ సంఘాలు చిత్ర యూనిట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.
ప్రతి కుక్కకి సమాధానం చెప్పను
తాజాగా డీడీ నెక్ట్స్ లెవల్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న సంతానం ఈ వివాదంపై స్పందించారు. తిరుమల శ్రీవారిని తాము అవమానించలేదని, సెన్సార్ బోర్డ్ నియమ నిబంధనల మేరకు సినిమా తీశామని పేర్కొన్నారు. రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారని.. వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని సంతానం చెప్పారు. సంతానం వివరణతో హిందూ సంఘాలు శాంతిస్తాయో? లేక కొత్తగా ఎలాంటి స్టెప్ తీసుకుంటాయో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











