చరణ్ పై కేసు వెనక్కి..హ్యాపీ
''ఆమె కేసు ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది. ఇలాంటి వాటివల్ల మన స్నేహం దెబ్బతింటుందని మొదటి రోజునుంచీ సోనాకు వివరించడానికి ప్రయత్నించాం. అయితే ఆమె వినిపించుకోలేదు. తర్వాత నా స్నేహితులు ఆమెతో మాట్లాడి మరిన్ని సమస్యలు కొని తెచ్చుకోవద్దని సలహా ఇచ్చారు. చివరికి కేసు మూతపడింది'' అని చరణ్ మీడియాతో అన్నారు.తమిళ నటి సోనా పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలకు గురైన నిర్మాత - గాయకుడు ఎస్పీ చరణ్‌పై పెట్టిన కేసును ఆమె ఉపసంహరించుకోవడంతే ఎట్టకేలకు ఆయనకు ఉపశమనం లభించింది.
ఈ ఆరోపణల నేపథ్యంలో చరణ్ తనకు క్షమాపణ చెప్పకుంటే మహిళా సంఘాల సాయంతో ఆయన ఇంటివద్ద ధర్నా చేస్తానని సోనా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై మొదటి నుంచీ మౌనంగానే ఉన్న చరణ్ చివరికి మౌనం వీడారు. మరోపక్క సోనా కూడా మీడియాతో ఈ ఇష్యూపై మాట్లాడింది. ''ఎస్‌పి చరణ్ నుంచి నేనేమి ఆశించానో అది వచ్చింది. అందుకే నా ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాను. అయితే, భవిష్యత్తులో చరణ్ నాపై ఆరోపణలు చేస్తే నేను కూడా అందుకు తగినట్లుగానే స్పందిస్తాను'' అని హెచ్చరించింది. ఇదిలా ఉండగా, చరణ్ తన పెళ్ళి పనులపై దృష్టి సారించారు. ''నా పెళ్ళి పనులు మొదలయ్యాయి. ఈ గొడవల వల్ల ఆ పనులు ఆపి ఉంచాం. ఇక మా అమ్మానాన్నా నాకో వధువును వెదుకుతారు'' అని చరణ్ చెప్పారు.


Click it and Unblock the Notifications











