భువనేశ్వరి అరెస్టు..తప్పించుకోవటానికి హై డ్రామా
సినిమా థియేటర్‌లో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన కేసుకు సంబంధించి నటి భువనేశ్వరిని వేలూరులో పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. భువనేశ్వరి ఈంజంబాక్కంలోని ఓ థియేటర్‌కు ఆదివారం రాత్రి దామోదరకృష్ణన్ అనే వ్యక్తితో వెళ్లింది. అక్కడ సేలైయూరుకు చెందిన కుమార్‌తో వీరికి వాగ్వాదం జరిగింది. ఇంతలో అక్కడికి చేరుకున్న భువనేశ్వరి అనుచరులు కుమార్‌పై దాడికి పాల్పడ్డారు. కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని వలసరవాక్కంకు చెందిన దామోదరన్, మణి, రాజేష్, కవిన్, గోపి, శంకర్‌ను అరెస్టు చేశారు.
ఈ కేసుకు సంబంధించి భువనేశ్వరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆమె చెన్నై నుంచి బెంగళూరుకు తప్పించుకుని వెళ్లేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే హైవే విభాగ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంబూరు సమీపం కన్నికాపురం ప్రాంతంలో మంగళవారం కారులో వెళ్తున్న భువనేశ్వరిని గస్తీ పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకోగా.. తాను భువనేశ్వరిని కాదంటూ ఆమె బుకాయించింది. తన పేరు శివానీ అని పేర్కొంటూ తప్పించుకునేందుకు విఫలయత్నం చేసింది. అరెస్టు చేసి ఆమెను చెన్నై నీలాంగరై పోలీసులకు అప్పగించారు. విచారణ కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications












