పర్సు తీసి డబ్బు ఇచ్చేసిన హీరో.. కొంతసేపటికే వృద్ధురాలి మరణం, విషాదకరంగా!
తమిళ హీరో విజయ్ సేతుపతి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రతి చిత్రంలో అద్భుత నటన కనబరుస్తూ నయా కమల్ హాసన్ గా తమిళనాటి కీర్తి ప్రతిష్టలు అందుకుంటున్నాడు. కేవలం హీరో పాత్రలకు మాత్రం పరిమితం కాకుండా నటనకు ఆస్కారం ఉంటె ఎలాంటి పాత్రలో అయినా తనదైన శైలిలో మెప్పిస్తున్నాడు. గత ఏడాది 96 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న విజయ్ సేతుపతి ఈ ఏడాది మరిన్ని చిత్రాలకు సిద్ధం అవుతున్నాడు. విజయ్ సేతుపతి నటిస్తున్న తాజా చిత్రం మామానితన్.

కేరళలో షూటింగ్
మామానితన్ చిత్ర షూటింగ్ ప్రస్తుతం కేరళలోని అలప్పూజా ప్రాంతంలో జరుగుతోంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడిగా యంగ్ హీరోయిన్ గాయత్రి నటిస్తోంది. శీను రామస్వామి ఈ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతుండడం విశేషం. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కూడా అతడే.
వృద్ధురాలికి సాయం
విజయ్ సేతుపతి సాయం అర్థించినవారికి తన వంతు సాయం చేయడంలో ముందుంటాడు. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ వృద్ధురాలు సెట్స్ లోకి వచ్చింది. తన ఆరోగ్యపరిస్థితి బాగాలేదని మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బు లేదని చెప్పడంతో విజయ్ సేతుపతి చలించిపోయాడు. వెంటనే తన పర్సుతీసి అందులో ఉన్న 500 నోట్లని ఆమెకు ఇచ్చేశాడు. విజయ్ సేతుపతి మనసుని సెట్స్ లో ఉన్న చిత్ర యూనిట్ మొత్తం అభినందించింది. విజయ్ సేతుపతి ఆ వృద్ధురాలికి సాయం చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

కొన్ని నిమిషాలకే
కానీ అంతలోనే విషాదం జరిగింది. విజయ్ నుంచి సాయం అందుకున్న నిమిషాల వ్యవధిలోనే ఆ వృద్ధురాలు కుప్పకూలిపోయింది. ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు ఆమె మరణించినట్లు నిర్ధారించారు. దీనితో విజయ్ సేతుపతి సహా చిత్ర యూనిట్ మొత్తం విచారం వ్యక్తం చేశారు. ఆరోగ్యం కోసం డబ్బు సాయం చేస్తే ఆ డబ్బే అంత్యక్రియలకు ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అసలు విషయం తెలిసి
వృద్ధురాలి మరణం తర్వాత ఆమె గురించి అసలు విషయం తెలిసింది. స్థానికులు చెప్పిన వివరాలు విన్న విజయ్ సేతుపతి కంగుతిన్నాడు. ఆమె పలు మలయాళీ చిత్రాల్లో నటించిన నటి. ఆమె పేరు కావలం అచ్చమ్మ. జయరాం లాంటి సీనియర్ హీరోల చిత్రాల్లో కూడా ఆమె నటించింది. ఓ ఇంటి తన చివరిరోజుల్లో ఇలా దీన పరిస్థితుల్లో మరణించడంపై విజయ్ సేతుపతి తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.


Click it and Unblock the Notifications











