నటి గౌతమి కోర్టులో న్యాయ పోరాటం.. కూతురిని చంపుతామని బెదిరింపులు
Actress Gautami: ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నటి గౌతమి. తొలుత డిజైనర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా నటించి మెప్పించింది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఈ తరుణంలో ఇటు తెలుగు, అటు తమిళ్ స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను కొట్టేసింది.
నటి గౌతమి సినీ జీవితం సాఫీగా సాగినా.. ఆమె తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకలను ఎదుర్కొంది. వాస్తవానికి ఆమె చిన్న వయసులోనే ప్రముఖ వ్యాపారవేత్త సందీప్ భాటియాను వివాహం చేసుకుంది. వీరికి సుబ్బలక్ష్మి అనే పాప జన్మించింది. ఆ బిడ్డ పుట్టిన ఏడాదికే వీరిద్దరు వీడిపోయారు. ఆ తర్వాత కొంతకాలం ఒంటరి జీవితం గడిపిన గౌతమి.. తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రేమలో పడి కొంతకాలం సహజీవనం చేశారు. వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో వారు కూడా తెగతెంపులు చేసుకున్నాడు. కమల్‌తో విడిపోయిన నాటి నుంచి గౌతమి ఒంటరిగానే ఉంటోంది.

ఇదిలా ఉంటే.. నటి గౌతమి ఓ భూమి విషయంలో ఘోరంగా మోసపోయిందంట. కోట్ల రూపాయాల విలువైన స్థలాన్ని కబ్జా చేశారని, ఆ అన్యాయాన్ని ప్రశ్నిస్తే.. తనను, తన కూతురిని చంపుతామని బెదిరిస్తున్నారని గతంలో చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడా కేసు కోర్టుకు వెళ్లింది. తనకు అన్యాయం జరిగిందనీ, న్యాయం జరిగే వరకు తన పోరాటం చేస్తానని స్పష్టం చేసింది గౌతమి.
వివరాల్లోకెళ్తే.. నటి గౌతమికి శ్రీపెరుంబూర్ సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కోట్ల విలువ గల స్థిరాస్తులు ఉన్నాయి. వ్యక్తిగత కారణాల వల్ల ఆమె.. తన కొంత భూమిని అమ్మేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని కారైక్కుడికి చెందిన అలగప్పన్ అనే ఏజెంట్‌కు అప్పగించింది. అళగప్పన్ రామనాథపురం జిల్లా కడలాడి సమీపంలో గౌతమికి చెందిన స్థలం కొనుగోలు చేస్తానని చెప్పి ముందుగా ఆ పత్రాలను పరిశీలించారు. ఆ ఆస్తిపై కన్నేసిన అలగప్పన్ ఆ స్థలానికి సంబంధించిన నకిలీ పత్రాలను సృ ష్టించి తన సొంతానికి విక్రయించారు.
ఇదేంటని ప్రశ్నించిన నటి గౌతమిపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ స్థలం గురించి తన దగ్గరి వస్తే.. నటిని, ఆమె కూతురిని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారంట. ఈ క్రమంలో ఆ నటి పోలీసులను ఆశ్రయించింది. సుమారు రూ. 3కోట్ల విలువ చేసే భూమిని తన ప్రమేయం లేకుండా విక్రయించాడనీ రామనాథపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో గౌతమి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సి.అళగప్పన్, ఆయన భార్య నాచ్చాళ్, కుమారుడు శివ, కోడలు ఆర్తి, బంధువు భాస్కర్, కారు డ్రైవర్ సతీష్ కుమార్‌లు బెదిరింపులకు పాల్పడ్డారనీ, ఈ వివాదం వల్ల తన కూతురు చదువు కూడా డిస్టర్బ్ అవుతోందని ఫిర్యాదులో పేర్కొంది.

గత ఏడాది నుంచి వారికి బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆ నిందితులు మళ్లీ బెయిల్ పిటిషన్ వేశారు. దీంతో వారికి బెయిల్ ఇవ్వకూడదని గౌతమి తరఫున హాజరైన న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. తన నుంచి కొట్టేసిన కోట్ల విలువైన స్థలాన్ని తిరిగి తనకు అప్పజెప్పాలని అభ్యర్థించింది. తనపై బెదిరింపులకు పాల్పడుతున్న అళగప్పన్‌పై చర్యలు చేపట్టాలని కోరింది. ఈ విషయంలో తనకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతానని స్ఫష్టం చేసింది నటి గౌతమి.


Click it and Unblock the Notifications











