Kasthuri Shankar : పరారీలో బుల్లితెర నటి కస్తూరి? .. ఫోన్ స్విచ్చాఫ్, ఇంటికి తాళం
తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ హీరోయిన్ , బుల్లితెర నటి కస్తూరి శంకర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. స్వయంగా క్షమాపణలు చెప్పినప్పటికీ ఆమెను తెలుగు, తమిళ సంఘాలు విడిచిపెట్టడం లేదు. కస్తూరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇప్పటికే ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తాజాగా కస్తూరి గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
నటిగా సినిమాల్లో , సీరియల్స్‌లో బిజీగా ఉంటున్నా సామాజిక కార్యకర్తగా, రాజకీయ నాయకురాలిగా యాక్టీవ్ రోల్ పోషిస్తున్నారు కస్తూరి శంకర్. సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు వివాదాస్పద పోస్ట్‌లు పెడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. తన సినిమాలు , వ్యక్తిగత వివరాలతో పాటు సామాజిక అంశాలపైనా స్పందిస్తూ ఉంటారు. ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభలో కస్తూరి శంకర్ మైక్ అందుకుని చెలరేగిపోయారు. తమిళనాడులో బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించే క్రమంలో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

300 ఏళ్ల క్రితం తమిళనాడులోని రాజుల వద్ద అంత: పుర మహిళలకి సేవ చేయడానికి తెలుగువారు ఈ ప్రాంతానికి వలస వచ్చి స్థిరపడ్డారని చెప్పారు. వారంతా శతాబ్ధాలుగా స్థిరపడిన బ్రాహ్మణులేనని, ఇప్పుడు వారిని తమిళులు కాదని ఎలా చెబుతారని కస్తూరి ప్రశ్నించారు. కానీ ఆ వెంటనే కస్తూరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలుగు సంఘాలు మండిపడుతున్నాయి.
దీంతో ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తెలుగు నా మెట్టినిల్లు.. తెలుగు వారంతా నా కుటుంబమని ఇది తెలుసుకోకుండా కొందరు నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని మండిపడ్డారు. తాను చేసిన వ్యాఖ్యలను డీఎంకే నేతలు వక్రీకరించి.. నాపై వ్యతిరేకత తీసుకొచ్చి నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని తెలుగు మీడియాకు కస్తూరి శంకర్ విజ్ఞప్తి చేశారు.
అయినప్పటికీ కస్తూరిపై ట్రోలింగ్ ఆగలేదు .. దీంతో మరోసారి ఆమె వివరణ ఇచ్చారు. తెలుగు భాషతో తనది ప్రత్యేక బంధమని చెప్పారు. తాను కొందరి గురించే చెప్పానని, మొత్తం తెలుగు ప్రజల గురించి కాదని కస్తూరి వివరణ ఇచ్చారు. ఎవరైనా తన వ్యాఖ్యలతో బాధపడి ఉంటే చింతిస్తున్నానని తెలిపారు. అయితే ఆమె వివరణ ఇచ్చినా, క్షమాపణలు చెప్పినా తెలుగు, తమిళ నేతలు తగ్గడం లేదు. తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాల్లో పోలీసులకు తెలుగు సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. చెన్నై ఎగ్మూర్ పోలీస్ స్టేషన్‌లో కస్తూరి శంకర్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
అయితే ఈ వివాదం నుంచి కస్తూరి తేలిగ్గా బయటపడే అవకాశాలు కనిపించడం లేదు. చేసిన వ్యాఖ్యల తీవ్రత దృష్ట్యా కఠిన చర్యలు తప్పవని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఏ క్షణమైనా కస్తూరి అరెస్ట్ అవుతారని అంటున్నారు. విచారణకు హాజరవ్వాల్సిందిగా పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేసేందుకు వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉందని, ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయని. కేసులు, అరెస్ట్ భయంతో కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి ఆమె నిజంగానే పరారీలో ఉన్నారా? త్వరలోనే అరెస్ట్ అవుతారా? తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











