సీఎం కుర్చీపై స్టార్ హీరోయిన్ కన్ను .. ఆ హీరోతో అందుకే క్లోజ్‌గా?
భారతదేశంలో సినిమా - రాజకీయాలకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజకీయ నాయకులకు, సినీతారల కోసం ప్రాణాలిచ్చే అభిమానులు దేశంలో అడుగడుగునా కనిపిస్తారు. సినీతారలే రాజకీయాల్లోకి వచ్చి పాలకులుగా మారిన చరిత్ర భారతదేశానిది. మహానటులైన ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలితలు ముఖ్యమంత్రులుగా సమర్ధవంతమైన పాలనను అందించడంతో పాటు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు.
వారి అడుగుజాడల్లో ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చారు. వీరిలో కొందరు సక్సెస్ కొట్టగా, మరికొందరు విఫలమయ్యారు. అయినప్పటికీ సినీనటులు రాజకీయాల్లోకి రావడం మాత్రం ఆగడం లేదు. ఎంపీలుగా , ఎమ్మెల్యేలుగా , మంత్రులుగా సినీనటులు రాణిస్తున్నారు. తెలుగునాట పవర్‌స్టార్‌గా అభిమానుల నీరాజనాలు అందుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి దాదాపు పదేళ్ల రాజకీయ పోరాటం ద్వారా తన లక్ష్యాన్ని అందుకున్నారు.

2024 ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తీవ్రంగా శ్రమించిన జనసేనాని.. పదేళ్ల నిరీక్షణకు ఫుల్‌స్టాప్ పెడుతూ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతేకాదు.. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి వినూత్న నిర్ణయాలతో పాలకుడిగానూ తన సత్తా చూపిస్తున్నారు. ఇక ఏపీ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్‌తో పాటు మరో అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తమిళ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ ఏళ్లుగా సాగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. తమిళగ వెట్రి కజగం (టీవీకే) పేరిట ఆయన పార్టీని ప్రకటించారు. ఇటీవల జరిగిన టీవీకే తొలి బహిరంగ సభకు దాదాపు 8 లక్షల మంది హాజరైనట్లు కథనాలు వచ్చాయి. కొద్దినెలల్లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని విజయ్ పావులు కదుపుతున్నారు. ఆయనతో స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ క్లోజ్‌గా ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తున్న వేళ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
దాదాపు 20 ఏళ్లుగా సినీరంగంలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు త్రిష. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ , హిందీ భాషల్లో ఎన్నో చిత్రాల్లో అగ్రనటుల సరసన నటించారు. 40 ప్లస్ క్రాస్ చేసినా నేటి వరకు ఆమె పెళ్లి మాటెత్తకపోగా.. ఇంకా సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సహా పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో త్రిష నటిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రజాసేవ చేయాలంటే కేవలం రాజకీయాలతోనే సాధ్యమన్నారు.
అక్కడితో ఆగకుండా రాజకీయాల్లోకి వెళ్లాలని, ఏదో ఒక రోజు తమిళనాడుకు ముఖ్యమంత్రికి కావాలనేది తన కల అని చెప్పడంతో తమిళ తంబీలు షాక్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అందుకేనా విజయ్‌తో క్లోజ్‌గా ఉంటున్నావంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఆమె మాటలను బట్టి చూస్తే విజయ్ పార్టీలో చేరి, వచ్చే తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు విశ్లేషకులు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.


Click it and Unblock the Notifications











