ఆడియో వేదికపై ఒకేసారి మూడు సింగాలు!
చెన్నై : సూర్య తాజా చిత్రం 'సింగం-2' ఆడియో వేడుకలో ఓ స్పెషల్ ఎట్రాక్షన్ చోటు చేసుకోనుంది. ఆడియోను జూన్ 2న నందంబాక్కంలోని ట్రేడ్ సెంటర్‌లో ఆవిష్కరించనున్నారు. ఈ వేడుక మరో ప్రత్యేకతను కూడా సంతరించుకోనుంది. మూడు సింగాలు ఒకటే వేదికపై సందడి చేయనున్నారు.
ఒక సింగం సూర్య, మిగతా రెండు బాలీవుడ్ అగ్రనటుడు అజయ్ దేవగన్, కన్నడ హీరో సుదీప్. తమిళంలో సింగం హిట్టయ్యాక రీమేక్‌గా అదే పేర్లతో హిందీ, కన్నడ భాషల్లో తెరకెక్కిన చిత్రాల్లో వారిద్దరూ ప్రధానపాత్రలు పోషించారు. 'సింగం-2' ఆడియో వేడుకకు వారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు.
సూర్య కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రాల్లో 'సింగం' ఒకటి. హరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వసూళ్లపరంగానూ కొత్త రికార్డులు సృష్టించింది. పోలీసు అధికారిగా సూర్య నటన అన్ని వర్గాలను అలరించింది.
ప్రస్తుతం హరి దర్శకత్వంలోనే 'సింగా'నికి కొనసాగింపుగా 'సింగం-2'లో నటిస్తున్నాడు సూర్య. తొలి భాగంలో ఆడిపాడిన అనుష్కతో పాటు హన్సిక కూడా ఇందులో సూర్య సరసన చేరింది. హీరోయిన్ అంజలి ప్రత్యేక గీతంలో తళుక్కున మెరవనుంది.


Click it and Unblock the Notifications











