దేవుడి పటాల పక్కనే శ్రీదేవి ఫోటో... అజిత్ కొత్త సినిమా ప్రారంభోత్సవం (ఫోటోస్)
తమిళ స్టార్ అజిత్ హీరోగా కొత్త చిత్రం చెన్నైలో ప్రారంభమైంది. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మించబోతున్న ఈ మూవీ లాచింగ్ ఈవెంటులో పలు ఆసక్తికర దృశ్యాలు దర్శనమిచ్చాయి. దేవుడి పటాల పక్కనే దివంగత నటి శ్రీదేవి ఫోటో పెట్టి నివాళులు అర్పించారు.
అజిత్ కెరీర్లో 59వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్లో విజయం సాధించిన 'పింక్' చిత్రానికి రీమేక్‌గా ఇది రూపొందుతోంది. 'పింక్'లో అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రలు పోషించారు.

లాయర్ పాత్రలో అజిత్
లైంగిక దాడులు జరిగినపుడు నిందితులకు బదులు బాధితులను ఈ సమాజం బ్లేమ్ చేసే తీరును ఎండగడుతూ ‘పింక్' చిత్రం సాగుతుంది. ఇందులో అమితాబ్ లాయర్ పాత్రలో, తాప్సీ లైంగిక దాడికి గురైన బాధితురాలిగా నటించింది. తమిళ రీమేక్‌లో అమితాబ్ పాత్రను అజిత్ పోషించనున్నట్లు తెలుస్తోంది.

అజిత్‌తో సినిమా చేయాలని శ్రీదేవి ఆశపడింది
అజిత్‌తో ఈ చిత్రం చేయడంపై బోనీ కపూర్ మాట్లాడుతూ... ‘గతంలో అజిత్‌తో ‘ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రానికి కలిసి పని చేశాను. ఆ సమయంలోనే శ్రీదేవి.. అజిత్ హీరోగా మా బేనర్లో తమిళ సినిమా చేయాలని ఆశపడింది. పింక్ రీమేక్ గురించి అజిత్ ప్రతిపాదించడంతో వెంటనే శ్రీదేవి అంగీకరించింది. ఈ చిత్రం తమిళంలో ఒక మంచి చిత్రంగా నిలుస్తుందని చెప్పింది' అని గుర్తు చేసుకున్నారు.

యువన్ సంగీతం
ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించబోతున్నారు. గతంలో యువన్ అజిత్ నటించిన దీనా, బిల్లా, బిల్లా 2, ఆరంభం తదితర చిత్రాలకు సంగీతం అందించారు.

అజిత్
అజిత్ నటించిన ‘విశ్వాసం' చిత్రం త్వరలో విడుదకు సిద్ధమవుతోంది. శివ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్, మాస్ ఎంటర్టెనర్లో నయనతార హీరోయిన్. సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మించగా వచ్చే సంక్రాంతికి విడుదలకు సిద్దమవుతోంది.


Click it and Unblock the Notifications











