కోట్లాదిమంది అభిమానులు ఉన్నా నేల విడిచి సాము చేయని స్టార్ హీరో...
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తనకు రోల్‌మోడల్ అని దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. అలాగే, తన గురువు, స్ఫూర్తి ప్రదాతగా ఆయన చెప్పుకొచ్చారు. రజనీకాంత్, ఐశ్వర్యా రాయ్ హీరో హీరోయిన్లుగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'రోబో" చిత్రం ఆడియో ఆవిష్కరణ ముంబైలో కన్నుల పండుగగా జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అమితాబ్ తనకు రోల్ మోడల్, గురువు. తాను ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ఖచ్చితంగా అమితాబ్ ను సంప్రదించి, సలహాలు తీసుకుంటానని చెప్పారు. తన పట్ల బిగ్ బి చూపిస్తున్న ప్రేమానురాగాలు, ఆప్యాయతలను ఎప్పటికీ మరిచిపోలేనన్నారు.
అనంతరం అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ రజనీకాంత్ తనకు ఎంతో ఆప్తుడు. ఎంతో పేరు ప్రతిష్టలతో పాటు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నప్పటికీ ఎపుడు కూడా నేల విడిచి సాము చేయరని ఆయన అన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ తో పాటు.. అభిషేక్ బచ్చన్, సన్ టీవీ నెట్ వర్క్ అధినేత కళానిధి మారన్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











