'విశ్వరూపం' స్పూర్తి: DTH ప్రసారానికి మరో ఐదు భారీ చిత్రాలు
చెన్నై: కమల్ విశ్వరూపం ఇచ్చిన ఉత్సాహంతో డీటీహెచ్‌లో ప్రసారం కావడానికి మరో ఐదు భారీ చిత్రాలు సిద్ధం అవుతున్నాయి. కమల్‌హాసన్ విశ్వరూపం చిత్రం ప్రయత్నం సక్సెస్ అయితే ఈ ఐదు చిత్రాల నిర్మాతలు ఇదే బాటలో అడుగులు వేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. కమల్‌హాసన్ నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం విశ్వరూపం. ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది. అయితే అందుకు ముందురోజున రాత్రి 9.30 గంటలకు డీటీహెచ్ ద్వారా ప్రసారం కానుంది. ఈ విధానం ద్వారా కమల్‌కు మంచి ఆదాయం రానుండడంతో ఇతర చిత్రాల నిర్మాతలు ఈ పద్ధతిని అవలంభించడానికి రెడీ అవుతున్నారు.
ఆ చిత్రాల్లో మొదటగా... కార్తీ నటించిన అలెక్స్ పాండియన్ జనవరి 12న విడుదల కానున్నట్టు ఆ చిత్ర నిర్మాత ప్రకటించారు. ఈ చిత్రం విడుదలకు థియేటర్ల యాజమాన్యంతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో అలెక్స్‌పాండియన్ చిత్రాన్ని డీటీహెచ్ ద్వారా ప్రసారం చేయడానికి చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇలాంటి పరిణామాలను అడ్డుకోలేమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అదే విధంగా రజనీకాంత్ నటించిన కోచ్చడయాన్, విక్రమ్ నటిస్తున్న ఐ చిత్రం, విజయ్, అజిత్ నటిస్తున్న తాజా చిత్రాలను డీటీహెచ్ ద్వారా ప్రసారం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రజనీ కోచ్చడయాన్ చిత్రం 3డీ ఫార్మాట్‌లో తెరకెక్కుతోంది. కాబట్టి ఈ చిత్రాన్ని ఇప్పుడు డీటీహెచ్ ప్రసారం కోసం 2డీలోకి మార్చుతున్నట్టు సమాచారం. డీటీహెచ్ ద్వారా ప్రసార విధానాన్ని నిర్మాతలు దర్శకులు, నటీనటులు ఆహ్వానిస్తున్నారు.
ఇక కమల్ విశ్వరూపం రూ.95 కోట్ల వ్యయంతో రూపొందిన చిత్రం. ఈ చిత్రాన్ని డీటీహెచ్‌లో తిలకించడానికి ఒక్కో కనెక్షన్‌కు రూ.వెయ్యి చెల్లించాలని నిర్ణయించారు. ఇందులో రూ.200 డీటీహెచ్ సంస్థలకు, రూ.800 కమల్‌కు చేరేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ కోచ్చడయాన్ ఇంతకంటే భారీ వ్యయంతో రూపొందుతుండడంతో దీని డీటీహెచ్ ధర మరింత పెరుగుతుందని సమాచారం. ఇతర చిత్రాలకు ఈ ధరను తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా కమల్ డీటీహెచ్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న థియేటర్ల సంఘం మూడో తారీఖున ఈ వ్యవహారంపై తిరుచ్చిలో సమావేశం కానుందిం. ఈ విషయాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోడానికి రెడీ అవుతోంది.


Click it and Unblock the Notifications











