తన సినిమాలో తన కూతురే హీరోయిన్
చెన్నై : తన కూతురుని తన దర్శకత్వంలో అదీ లవ్ స్టోరీలో చేస్తారా..చేస్తానంటున్నారు 'యాక్షన్‌కింగ్' అర్జున్. మారుతున్న కాలానికి తగ్గట్టు తనను తాను మలుచుకుంటున్న నటుడు. హీరోగా, విలన్‌గా, సహాయ నటుడిగా.. తనదైనశైలి ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం 'జైహింద్ 2'లో స్వీయ దర్శకత్వంలో నటిస్తున్నారు. చిత్రీకరణ చివరిదశలో ఉంది. అక్టోబరులో రెండో వారంలో సినిమాను తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇది విడుదలయ్యాక అర్జున్ కొత్త సినిమాకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో ఆయన కుమార్తె ఐశ్వర్య హీరోయిన్‌గా నటించనుంది. ఇటీవల విశాల్ నటించిన 'పట్టత్తుయానై' ద్వారా కోలీవుడ్‌లో అడుగుపెట్టింది ఐశ్వర్య. ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. దీంతో తండ్రే.. మంచి బ్రేక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

అర్జున్ మాట్లాడుతూ.. '' 'జైహింద్ 2' చివరిదశకు చేరుకుంది. 'జైహింద్' మాదిరిగానే అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం రెండు ప్రేమకథా చిత్రాలు నా వద్ద ఉన్నాయి. వాటిలో ఒక దానిని రెండు నెలల్లో సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నా. ఇందులో నా కుమార్తె హీరోయిన్‌గా నటిస్తుంది. ఇతర తారాగణం ఎంపిక ప్రక్రియ సాగుతోంది. నా దర్శకత్వంలో నా కుమార్తె హీరోయిన్ గా చిత్రం చేయడం చాలా భిన్నంగా అనిపిస్తోంది. ప్రారంభంలో ఈ విషయం చెప్పినప్పుడు ఐశ్వర్య కూడా ఆలోచించింది. మంచి ప్రేమకథా చిత్రం కావడం వల్లే ఆమెను ఎంచుకున్నాను''ని పేర్కొన్నారు.
మాస్ చిత్రాలతో అలరిస్తూ యాక్షన్ హీరోగా చెరగని ముద్ర వేసిన నటుడు అర్జున్. అపజయాలు ఎదురైన ప్రతీసారి అర్జున్ తన చేతిలోకి ఓ ఆయుధాన్ని తీసుకుంటారు. అదేంటంటే తానే ఓ కథను సిద్ధం చేసుకుంటారు. దాన్ని తానే నిర్మించి దర్శకత్వం కూడా వహిస్తారు. అలా చేసిన ప్రయత్నాలు చాలాసార్లు చక్కని ఫలితాన్నే ఇచ్చాయి. ఇప్పటికే హీరోగా కొనసాగుతున్న అర్జున్.. ప్రస్తుతం కుమార్తె కెరీర్‌ను దారికి తెచ్చే పనిలో ఉన్నారు.
'ఈ సినిమాలో మీరు నటిస్తున్నారా..?' అని కొందరు ప్రశ్నించగా.. 'దర్శకత్వం, నిర్మాణం వరకే తన పాత్ర పరిమితము'అని సమాధానమిచ్చారు. విశాల్‌కు జంటగా ఐశ్వర్య 'పట్టత్తుయానై'లో నటించింది. ఇది ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించని నేపథ్యంలో ఆమెకు కొత్త అవకాశాలేవీ రాలేదు. ప్రస్తుతం కుమార్తె కోసం తానే ఓ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారట అర్జున్. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారట. కథ ఓ కొలిక్కి వచ్చాక హీరో, ఇతర విషయాలపై దృష్టి సారించనున్నారు.


Click it and Unblock the Notifications











