బాహుబలి 2 వివాదం... రిలీజ్ ఆగిపోయిన ధనుష్, విజయ్ సేతుపతి సినిమాలు!
'బాహుబలి 2' చిత్రానికి సంబంధించిన వివాదం కారణంగా తమిళ స్టార్ ధనుష్ నటించిన 'ఎన్నై నోకి పాయుమ్', విజయ్ సేతుపతి మూవీ 'సింధుబాద్' ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన నిర్మాతలకు, బాహుబలి 2 చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన ఆర్కా మీడియా సంస్థకు మధ్య ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండటమే ఇందుకు కారణం.
ఈ వివాదానికి సంబంధించి 'బాహుబలి 2' నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించే వరకు కె ప్రొడక్షన్ అధినేత ఎఎన్ రాజరాజన్('సింధుబాద్' నిర్మాత), పి మదన్ ('ఎన్నై నోకి పాయుమ్' నిర్మాత) చిత్రాలపై స్టే విధించాలని కోరారు.

ఎస్ఎన్ రాజరాజన్ గతంలో 'బాహుబలి 2' తమిళనాడు థియేట్రికల్ రైట్స్ రూ. 28 కోట్లకు కొనుగోలు చేశారు. అయితే రూ. 12.5 కోట్లు మాత్రమే చెల్లించాడు. మిగతా సొమ్ము తర్వాత చెల్లిస్తానని నిర్మాత శోభు యార్లగడ్డతో లోన్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. అయితే సినిమా విడుదలై రెండేళ్లు దాటిపోయినా ఆ మొత్తం చెల్లించలేదు. దీంతో బాహుబలి నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు.
ఈ వ్యవహారంలో 'ఎన్నై నోకి పాయుమ్' నిర్మాత మదన్ పూచికత్తుగా ఉండటంతో ఆ సినిమా రిలీజ్ మీద కూడా ఎఫెక్ట్ పడింది. తెలంగాణ హైకోర్టు మే 8న ఈ కేసుకు సంబంధించి రెండు సినిమాల విడుదలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
షెడ్యూల్ ప్రకారం ధనుష్ నటించిన 'ఎన్నై నోకి పాయుమ్' చిత్రం ఈ రోజు(మే 10) విడుదలవ్వాల్సి ఉంది. 'సింధుబాద్' చిత్రం 16న రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే సమయానికి డబ్బు చెల్లించక పోవడంతో ఈ రెండు చిత్రాల విడుదల ఆగిపోయింది.
'సింధుబాద్' సినిమా విషయానికొస్తే... విజయ్ సేతుపతి హీరోగా ఎస్యూ అరుణ్ కుమార్ ఈ చిత్రం తెరకెక్కించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో అంజలి హీరోయిన్. 'ఎన్నై నోకి పాయుమ్' చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో మేఘా ఆకాష్ హీరోయిన్.


Click it and Unblock the Notifications











