పీకలదాకా తాగి జనాలపైకి కారు.. తమిళ నటుడు అరెస్ట్!
సెలెబ్రిటీలు తరచుగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడుతుండడం చూస్తూనే ఉన్నాం. మద్యం సేవించి భాద్యత రాహిత్యంగా వాహనాలు నడిపే సెలెబ్రిటీలు ఇప్పటివరకు చాలా మంది అరెస్ట్ అయి పరువు తీసుకున్నారు. తాజాగా అలాంటి ఘటన చైన్నై నగర శివారులో జరిగింది. తమిళ నటుడు శక్తి వాసుదేవన్ మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి దిగ్గజ దర్శకుడు పి వాసు తనయుడు కావడంతో ఈ వార్త మరింతగా వ్యాపించింది.

బిగ్‌బాస్ సెలెబ్రిటీగా
శక్తి వాసుదేవన్ ఎన్ని చిత్రాల్లో నటించినా సరైన గుర్తింపు లభించలేదు. తమిళ బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. బిగ్‌బాస్‌తో శక్తి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం శక్తి మద్యంసేవించి ప్రమాదకరంగా వాహనం నడుపుతుండడంతో అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

జనాలపైకి
చెన్నై నగర శివారులో చూలైమేడు ప్రాంతంలో ఓ కారు ప్రమాదకరంగా జనాలపైకి దూసుకుని వస్తోంది. అక్కడున్నవారంతా అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం తప్పింది. రాష్ డ్రైవింగ్ చేస్తున్న అతడిని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. అతడి వాహనాన్ని ఆపి కిందికి దిగాలని డిమాండ్ చేశారు. అతడిని చూడగానే బిగ్ బాస్ సెలెబ్రిటీ శక్తి అని జనం అంతా ఆశ్చర్యపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

నిలబడలేని పరిస్థితి
పోలీసులు అతడిని కిందికి దించే ప్రయత్నం చేయగా పూర్తిగా మద్యం మత్తులో ఉండిపోయాడు. కనీసం అతడు నిలబడలేని పరిస్థితి నెలకొంది. దీనితో పోలీసులు అతడి వాహనంలోనే పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతడిపై పలు సెక్షన్స్ కింద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసునమోదు చేశారు. ఆ తర్వాత అతడు బెయిల్ పై విడుదలైనట్లు తెలుస్తోంది.

దర్శకుడి కుమారుడిగా
దిగ్గజ దర్శకుడు పి వాసు కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన శక్తి ఇంత వరకు తనదైన మార్క్ ప్రదర్శించలేక పోయాడు. పైగా ఇలాంటి కేసులు అతడి కుటుంబ ప్రతిష్టని దిగజార్చేలా ఉన్నాయి. శక్తి స్నేహితులు అతడిని పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. శక్తి ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











