నిజమే... ఒప్పించటానికే సూపర్ స్టార్ ఇంటికెళ్లారు
చెన్నై : తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ ఏమిటీ అంటే...సూపర్‌స్టార్ రజినీకాంత్ ఇంటికి భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ అతిథిగా విచ్చేశారనదే. లతా రజనీకాంత్ నిర్వహించిన బొమ్మల కొలువులో ఆమె పాలుపంచుకున్నారు. రజనీని భాజపాలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ యత్నిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని తాజాగా తమిళిసై కూడా ధ్రువీకరించారు.
గత లోక్‌సభ ఎన్నికల్లోనే ఆయన్ను ఒప్పించేందుకు మోడీసేన యత్నించింది. కానీ సూపర్‌స్టార్ మౌనం వహించడంతో తమ తదుపరి టార్గెట్‌ను అసెంబ్లీ ఎన్నికలపై పెట్టింది భాజపా. ఎలాగైనా ఆ ఎన్నికల నాటికి రజనీ 'వాయిస్'ను తమ వశం చేసుకునేందుకు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా తమిళిసై సౌందరరాజన్ కూడా రజనీకాంత్ ఇంటికి వెళ్లడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.

రజనీకాంత్ ఇంటి ఆతిథ్యం గురించి తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. తమ ఇంటి బొమ్మల కొలువులో పాల్గొనాలని లతా రజనీకాంత్ ఆహ్వానించారని చెప్పారు. అందులో పాల్గొన్న విషయం నిజమేనని తెలిపారు. ఈ సందర్భంగా మోడీ గురించి తాను రాసిన పుస్తకాన్ని వారికి అందించానని వివరించారు. రజనీకాంత్, మోడీల మధ్య స్నేహబంధం దృఢంగా ఉందని పేర్కొన్నారు. భాజపా పథకాలను కూడా రజనీ అభినందించారని అన్నారు.
తాజాగా 'స్వచ్ఛ భారత్'ను కూడా ప్రశంసించారని తెలిపారు. సూపర్‌స్టార్‌తో మరోసారి భేటీ కానున్నానని, ఈ సందర్భంగా భాజపాలోకి ఆహ్వానించడంపై చర్చిస్తానని ఆమె తెలిపారు. రజనీకాంత్, కమల్ వంటి నటులు సమాజాభివృద్ధి కోసం కృషిచేస్తారని ప్రశంసించారు. వారు తమకు మద్దతు పలికే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ మార్పు జరగాలని అభిలషించారు. ఇందుకు వారు కొత్తబాట వేయాలని కోరారు.


Click it and Unblock the Notifications











