నేను కావాలని దూరం పెట్టడం లేదు : ప్రభుదేవా
హైదరాబాద్: బాలీవుడ్లో దర్శకుడిగా బిజీ అయిన తర్వాత ఫిల్మ్ మేకర్ ప్రభుదేవా తమిళ సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే త్వరలోనే మళ్లీ తమిళంలో సినిమా చేస్తాను అని ప్రభుదేవా స్పష్టం చేసారు. తాజా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలియజేసారు.
‘నేను కావాలని తమిళ సినిమాలకు దూరంగా ఉండటం లేదు. ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా ఉన్నాను. బాలీవుడ్లో కమిట్మెంట్స్ పూర్తి చేయడం నా బాధ్యత. వీలైనంత త్వరగా ఇక్కడ పనులు పూర్తి చేసుకుని తమిళ సినిమాలపై దృష్టి పెడతాను' అని ప్రభుదేవా తెలిపారు.

బాలీవుడ్లో ‘రౌడీ రాథోర్', ‘ఆర్...రాజ్ కుమార్' లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రభుదేవా తమిళంలో....‘పోక్కిరి', ‘విల్లు', ‘వేడి' అనే చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కుతున్న హిందీ మూవీ ‘యాక్షన్ జాక్సన్' చిత్రం షూటింగుతో బిజీగా గడుపుతున్నారు.
‘మరో 10 శాతం షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. మరో మూడు సాంగ్స్ చిత్రీకరించాల్సి ఉంది. ఆస్ట్రేలియాలో ఈ పాటల చిత్రీకరణ చేయాలనుకుంటున్నాం' అని తెలిపారు. దర్శకత్వం విషయం పక్కన పెడితే...ప్రభుదేవా ‘ఎబిసిడి 2' అనే చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











