కెప్టెన్ విజయ్‌కాంత్‌కు కన్నీటి వీడ్కోలు.. పోటెత్తిన అభిమానులపై పోలీసుల లాఠీఛార్జి.. ముగిసిన అంత్యక్రియలు
దిగ్గజ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయ్‌కాంత్‌కు వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు, స్నేహితులు, సన్నిహితులు కన్నీటి ధారతో, విషాద వదనంతో వీడ్కోలు పలికారు. డిసెంబర్ 28వ తేదీ తెల్లవారుజామున విజయ్‌కాంత్ కరోనావైరస్ పాజిటివ్, ఇతర ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు డిసెంబర్ 29వ తేదీ సాయంత్రం చెన్నైలో అభిమానుల భావోద్వేగాల మధ్య ముగిసాయి. అంత్యక్రియల వివరాల్లోకి వెళితే..
కెప్టెన్ విజయ్‌కాంత్ పార్థీవ దేహానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు శ్రద్దాంజలి ఘటించారు. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి ప్రముఖులు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన సతీమణి ప్రేమలతను ఓదార్చారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. విజయ్‌కాంత్ అత్యంత నిజాయితీపరుడు. సమస్యలపై సరైన ఆవేశంతో పోరాటం, తిరుగుబాటు చేసేవారు అని అన్నారు.

తమిళనాడు ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నది. ఈ క్రమంలో విజయ్‌కాంత్‌కు ముఖ్యమంత్రి స్టాలిన్ శ్రద్దాంజలి ఘటించారు. ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం ఉంచారు. కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పారు. ఆ తర్వాత ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర బయలుదేరింది.

విజయ్‌కాంత్ యాత్రకు హాజరైన ప్రజలను చూస్తే జనసంద్రాన్ని తలపించింది. వేలాది మంది అభిమానులు ఆయనను చివరి చూపు చూసుకొన్నారు. కెప్టెన్ విజయ్‌కాంత్ అమర్ రహే అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. చిరస్థాయిగా తమ గుండెల్లో గూడుకట్టుకొని ఉంటావు అంటూ నినాదాలు చేశారు. గంటలపాటు సాగిన ఊరేగింపు సాయంత్రం కోయంబెడీలోని డిఎండీకే పార్టీ కార్యాలయానికి చేరుకొన్నది.

విజయ్‌కాంత్‌ను కడసారి దర్శించుకొనేందుకు డీఎండీకే ప్రధాన కార్యాలయానికి భారీగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు పోటెత్తడంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసులు తరం కాలేదు. ప్రోటోకాల్ ప్రకారం ప్రముఖులను, కుటుంబ సభ్యులు, బంధువులను కొద్దిమందిని అనుమతించడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో తమను కూడా అనుమతించాలని అభిమానులు రోడ్డుపై ధర్నా చేశారు. దాంతో వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది.


చివరకు అభిమానుల విషాదఛాయల మధ్య గంధపు చెక్క బాక్సులో పెట్టిన విజయ్‌కాంత్ భౌతికకాయాన్ని కోయెంబేడులోని పార్టీ కార్యాలయంలో ఖననం చేశారు. దాంతో విజయ్‌కాంత్ శాశ్వత నిద్రలోకి జారుకొన్నారు. అభిమానులు, కార్యకర్తలు ఆయనను దర్శించుకొనేందుకు ఆ ప్రాంతంలో స్మారకస్తూపాన్ని నిర్మించాలని నిర్ణయించారు.


Click it and Unblock the Notifications











