12 ఏళ్లకు భారీ యాక్సిడెంట్.. 23 సర్జరీలు.. నిలబడేందకు అన్నేళ్లు: చియాన్ విక్రమ్
చియాన్ విక్రమ్.. పేరుకు కోలీవుడ్ హీరో అయినా తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సినీ కెరీర్ మొదట్లో తెలుగు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు పోషించిన విక్రమ్ శివ పుత్రుడు సినిమాతో స్టార్ యాక్టర్ గా ఎదిగాడు.
ఇక సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన అపరిచితుడు మూవీ ద్వారా ఆయన స్టార్‌డమ్ అమాంతం పెరిగిపోయింది. గతేడాది పొన్నియన్ సెల్వన్ సినిమాతో అలరించిన ఆయన త్వరలో పొన్నియన్ సెల్వన్ 2తో రానున్నాడు. తాజాగా ఆయనకు జరిగిన 23 సర్జరీల గురించి షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు.

రెండు పార్టులుగా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన చిత్రం పొన్నియన్ సెల్వన్. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కించారు. వీటిలో మొదటి భాగం గతేడాది సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించింది. ఆ సినిమా ఫలితం తెలుగులో ఎలా ఉన్న తమిళ ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు.
పీఎస్ 2 ప్రమోషన్స్: పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1లో చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఐశ్వర్య రాయ్, త్రిష వంటి అగ్ర తారలు నటించారు. ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 (PS2) మూవీ ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇందులో భాగంగానే జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది చిత్రబృందం. ఇప్పటికే దీని నుంచి వచ్చిన టీజర్, పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

బైక్ పై వెళ్తుంటే: పొన్నియన్ సెల్వన్ 2 ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తాజాగా చియాన్ విక్రమ్ పాల్గొన్నారు. ఇందులో ఆయనకు జరిగిన సర్జరీల గురించి యాంకర్ ప్రస్తావించగా అసలు విషయం చెప్పుకొచ్చాడు విక్రమ్. ఆయనకు 12 ఏళ్ల వయసులోనే భారీ యాక్సిడెంట్ జరిగింది. తన ఫ్రెండ్ తో కలిసి అతని బైక్ పై వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో తన కుడి కాలు, మోకాలి నుంచి చీలమండ వరకు పూర్తిగా నలిగిపోయిందని తెలిపారు.
అన్నేళ్లపాటు వీల్ చైర్: అదే బైక్ యాక్సిడెంట్ లో ఎముకలు విరిగిపోయాయి. చర్మం బాగా దెబ్బతింది. దీంతో రాయపేట హాస్పిటల్ డాక్టర్స్ విక్రమ్ కాలును తొలగించాలని సూచించారట. కానీ అందుకు ఆయన తల్లి ఒప్పుకోలేదు. అయితే అప్పుడు విక్రమ్ కోలుకునేందుకు 2 శాతం మాత్రమే అవకాశం ఉండిందట. ఇక దాని తర్వాత విక్రమ్ నడిచేందుకు నాలుగేళ్లు పట్టిందట. మూడేళ్ల పాటు వీల్ చైర్ లో ఉండి.. ఏడాది పాటు క్రచెస్ సాయంతో నడించినట్లు విక్రమ్ చెప్పుకొచ్చారు.

ఇన్ ఫెక్షన్లు..: ఇక యాక్సిడెంట్ కు గురైన విక్రమ్ కు మొత్తంగా తనను తాను కాపాడుకునేందుకు 23 సర్జరీలు చేయుంచుకున్నాడు. ట్రీట్ మెంట్ పూర్తయ్యాక కూడా ఇన్ ఫెక్షన్ల కారణంగా రెగ్యులర్ గా హాస్పిటల్ కు వెళ్లాల్సి వచ్చేదట. సంకల్ప బలం, అంకితభావంతోనే తన పరిస్థితి నుంచి బయటపడినట్లు, పట్టుదలే తనను ఈరోజు సక్సెస్ ఫుల్ స్టార్ గా నిలబెట్టినట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











