కూలీని అలా దెబ్బకొట్టారు.. రజనీ మూవీకి ఎన్ని కోట్ల నష్టమంటే? లోకేష్ కనగరాజ్ క్లారిటీ
కోలీవుడ్ సూపర్‌స్టార్ దళపతి విజయ్ నటించిన చివరి మూవీ జన నాయగన్ రిలీజ్ సెన్సార్ బోర్డ్ నుంచి అనుమతి రాకపోవడంతో చిత్ర నిర్మాతలు న్యాయ పోరాటం చేస్తున్నారు. అటు సినీ పరిశ్రమ నుంచి విజయ్‌కి పెద్ద ఎత్తున మద్ధతు లభిస్తోంది. భారతదేశంలోని అన్ని పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ వివాదంపై స్పందిస్తున్నారు. రాజకీయ ఒత్తిడి కారణంగానే విజయ్ సినిమా రిలీజ్ కాకుండా సెన్సార్ బోర్డ్ అడ్డంకులు సృష్టిస్తోందని సినీ ప్రముఖులు, టీవీకే కేడర్ ఆరోపిస్తోంది.
సెన్సార్ బోర్డ్‌పై లోకేష్ కనగరాజ్ వ్యాఖ్యలు
రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు జన నాయగన్ విడుదలపై హైడ్రామా కొనసాగుతూనే ఉంది. అయితే సీబీఎఫ్‌సీ మాత్రం జన నాయగన్‌లో కొన్ని వివాదాస్పద అంశాలు ఉన్నందునే రివైజింగ్ కమిటీ రివ్యూకి పంపామని చెబుతోంది. సున్నితమైన అంశం కావడం వల్లే నిర్ణయంలో జాప్యం జరుగుతోందని వాదిస్తోంది. దాంతో సెన్సార్ బోర్డ్‌ను కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పించి సినీ పరిశ్రమ పరిధిలోకి తీసుకురావాలనే ఇవ్వాలనే డిమాండ్లు సైతం వినిపిస్తున్నాయి. అలా సెన్సార్ బోర్డ్‌పై విమర్శలు వస్తున్న వేళ.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి.

లోకేష్ జోరుకు కూలీ బ్రేక్
తమిళ చిత్ర పరిశ్రమలో అపజయం లేకుండా సాగుతున్న లోకేష్ కనగరాజ్ జోరుకు కూలీ మూవీ బ్రేక్‌లు వేసింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. రిలీజ్ అయ్యాక మిక్స్‌డ్ టాక్ కారణంగా కూలీ కలెక్షన్స్ పడిపోయాయి. థియేట్రికల్ రన్ ముగిసేసరికి కూలీ మూవీ ఇండియాలో 285 కోట్ల రూపాయల నెట్.. 337.50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్‌లో ఏకంగా 180.50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా 518 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది. అయితే చిత్ర నిర్మాతలు మాత్రం కూలీకి 650 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్లు తెలిపారు.
లోకేష్‌పై విమర్శలు
అయితే చాలా ఏరియాలలో కూలీ మూవీ బ్రేక్ ఈవెన్ కాకపోవడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కోట్లలో నష్టపోయారు. దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్.. భారీగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ నేపథ్యంలోనే కూలీ డిజాస్టర్‌గా నిలిచిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దాంతో దర్శకుడు లోకేష్ కనగరాజ్‌పైనా ఇంటా బయటా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒకదశలో ఆయనతో సినిమాలు చేయడానికి కూడా కొందరు స్టార్స్ వెనక్కి తగ్గినట్లుగా గాసిప్స్ వినిపించాయి. ఈ దశలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించి విమర్శలకు చెక్ పెట్టారు లోకేష్. అయితే కూలీ రిజల్ట్, ఆ తర్వాత తనపై వచ్చిన విమర్శలతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తాజాగా చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో కూలీ సినిమా ఫలితం గురించి మాట్లాడుతూ లోకేష్ కనగరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
50 కోట్లు నష్టపోయాం
కూలీ మూవీకి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ (పెద్దలకు మాత్రమే) రేటింగ్ ఇవ్వడం వల్ల దాదాపు 50 కోట్ల రూపాయల మేర వసూళ్లు తగ్గాయి. సెన్సార్ బోర్డ్ ఏకంగా 35 కట్స్ సూచించింది. సినిమాలో అత్యంత కీలకమైన ఎలక్ట్రిక్ క్రిమేషన్ ఎపిసోడ్స్‌కు సంబంధించి కొన్ని హింసాత్మక సన్నివేశాలపై బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కీలకమైన ఆ సీన్స్ తొలగిస్తే కథలో ఇంపాక్ట్ తగ్గిపోతుందని భావించి ఎలక్రిక్ క్రిమేషన్‌కు సంబంధించిన సీన్స్‌ని ఎడిట్ చేయడానికి ఒప్పుకోలేదు. దాంతో కూలీకి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. దీని వల్ల కుటుంబ ప్రేక్షకులు, పిల్లలు థియేటర్లకు రాలేదు. దీని కారణంగా 50 కోట్ల రూపాయల మేర వసూళ్లు తగ్గాయి అని లోకేష్ కనగరాజ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దాంతో ఇది కోలీవుడ్‌లో మరో వివాదానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











