తెలుగు డైరక్టర్ తో అజిత్ చిత్రం ఖరారు
తమిళంలో అజిత్ ఇప్పుడు సూపర్ స్టార్ గా వెలుగుతున్నాడు. ఆయన తాజా చిత్రం 'డేవిడ్ బిల్లా' త్వరలో తెలుగులోకి విడుదల కానున్నది. ఈ నేపధ్యంలో ఓ తెలుగు డైరక్టర్ తో అజిత్ తదుపరి చిత్రం చేయనున్నారని తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు. 'శౌర్యం' చిత్రంతో దర్శకత్వం వైపు అడుగులు వేసిన కెమెరామెన్ శివ. అంతకు ముందు ఛాయాగ్రాహకుడిగా 'శ్రీరామ్', 'నేనున్నాను' లాంటి చిత్రాలకు పని చేశారు. 'శంఖం', తమిళంలో 'సిరుతై' చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు రవితేజతో 'దరువు' చిత్రాన్ని రూపొందించారాయన.
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ...అజిత్ హీరోగా ఓ చిత్రం ఉంటుంది. విజయ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది అన్నారు. ఇక దరువు గురించి మాట్లాడుతూ... సౌండ్ ఆఫ్ మాస్ అని ముందే చెప్పాం. చిన్నారుల దగ్గర్నుంచి, పెద్దవాళ్ల వరకూ... ప్రతి ఒక్కరినీ దృష్టిలో పెట్టుకొని ఈ కథ తయారు చేసుకొన్నాను. రవితేజ శైలిలోనే వినోదాత్మకంగా ఉంటుంది. అలాగే బ్రహ్మానందం పోషించిన విద్యాబాలన్ అనే పాత్ర కూడా కితకితలుపెడుతుంది. కథలో కీలక మలుపునకు కారణమయ్యే కొన్ని సన్నివేశాలు యమలోకంలో సాగుతాయి. అంతే తప్ప కథంతా అక్కడే సాగదు. సోషియో ఫాంటసీ తరహాలో ఉంటుంది. రవితేజ పాత్ర భిన్న కోణాల్లో ఉంటుంది అన్నారు.
అజిత్ విషయానికి వస్తే... అజిత్ ని స్టయిలిష్‌గా ఆవిష్కరించిన చిత్రం 'బిల్లా' చిత్రానికి ప్రీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం కథ ఎలా ఉండబోతోందనేది అంతటా హాట్ గా మారింది. అందులోనూ ఈ చిత్రం సీక్వెల్ కాకుండా బిల్లాకు ప్రీక్వెల్ కావటంతో మరింత ఆసక్తి పెరిగింది. ఇక ఈ చిత్రం కథ...బిల్లా మాఫియా లీడర్ అవ్వకముందు ఏం చేసేవాడు? అతను మాఫియాలోకి ఎంటరవ్వడానికి కారణం ఏంటి? అసలు బిల్లాగా అతను ఎలా రూపొందాడు. అంత పరవ్ శక్తిగా ఎలా మారి ప్రపంచానికి సవాళ్లు విసిరాడు...వంటి అనేక విషయాలు ఈ చిత్రంలో చర్చకు రానున్నాయి. ఇవన్నీ ఫ్లాష్‌బ్యాక్ లో రానుందని తెలుస్తోంది.
ఇక 'డేవిడ్ బిల్లా' చిత్రం తెలుగు విడుదల హక్కులను ఎస్వీఆర్ మీడియా అధినేత శోభారాణి చేజిక్కించుకున్నారు. ఈ సినిమా గురించి శోభారాణి చెబుతూ ...అజిత్ కెరియర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో అజిత్ రిస్కీ ఫైట్లు చేశారు. ఈ ఫైట్స్ ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటాయి. 'బిల్లా'లో అజిత్ స్టయిలిష్‌గా కనిపించారు. ఈ చిత్రంలో ఆయన మరింత స్టయిలిష్‌గా కనిపిస్తారు. ఈ చిత్రం కోసం ఉక్రెయిన్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు అన్నారు.


Click it and Unblock the Notifications











