తమిళ పవర్ స్టార్ అదృశ్యం.. భార్యకు బెదిరింపు కాల్స్!
తమిళ నటుడు పవర్ స్టార్ శ్రీనివాసన్ అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కమెడియన్ గా పవర్ స్టార్ శ్రీనివాసన్ తమిళ చిత్రాల్లో రాణిస్తున్నాడు. 2010 లో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ శ్రీనివాసన్ పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. శ్రీనివాసన్ హావభావాలు, కామెడీ టైమింగ్ బావుండడంతో ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నారు. తాజాగా శ్రీనివాసన్ గురించి వైరల్ అవుతున్న వార్తలు సంచలనం సృష్టిస్తోంది.

సంతానం హీరోగా
ప్రముఖ కమెడియన్ సంతానం హీరోగా నటించిన చిత్రం కన్నా లడ్డు తిన్న ఆశయై అనే చిత్రంలో పవర్ స్టార్ శ్రీనివాసన్ క్యారెక్టర్ రోల్ లో నటించాడు. అతడి పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి శ్రీనివాసన్ కు మంచి అవకాశాలు వచ్చాయి. తమిళంలో బిజీ ఆర్టిస్టుగా మారాడు. కానీ శ్రీనివాసన్ కు పలు ఆర్థిక సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది.

శ్రీనివాసన్ అదృశ్యం
శ్రీనివాసన్ గురువారం నుంచి అదృశ్యమైనట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులకు కూడా అతడి వివరాలు తెలియడం లేదు. శ్రీనివాసన్ గురువారం ఉదయం తన స్నేహితుడి ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి ఇంతవరకు రాలేదని ఆయన భార్య పోలీసులతో పేర్కొంది. ఆరా తీస్తే మిత్రుడి ఇంటివద్ద కూడా శ్రీనివాసన్ లేరని తేలింది. తన తండ్రిని కిడ్నాప్ చేసి ఉంటారని శ్రీనివాసన్ కుమార్తె ఆరోపించింది.

కేసులతో ఇబ్బందులు
శ్రీనివాసన్ పై పలు ఆర్థిక మోసాలకు సంబందించిన కేసులు ఉన్నాయి. ఒక కేసులో శ్రీనివాసన్ తీహార్ జైలులో కూడా శిక్ష అనుభవించి వచ్చారు. శుక్రవారం శ్రీనివాసన్ భార్య తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. తనకు కొన్ని బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని ఆమె పోలీసులకు తెలిపింది. నీ భర్త పేరు మీద ఉన్న ఆస్తులన్నీ మా పేరుమీద రాయాలని ఫోన్ చేసి బెదిరిస్తునట్లు ఆమె పేర్కొంది.

ఊటీలో ప్రత్యక్షం
దీనితో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన కొంత సమయానికే శ్రీనివాసన్ ఆచూకీ లభించింది. శ్రీనివాసన్ ఊటీలో ఉన్నట్లు తేలింది. శ్రీనివాసన్ కు ఊటీలో ఓ బంగ్లా ఉందట. ఆర్థిక సమస్యల కారణంగా ఆ బంగ్లాని అమ్మడానికి శ్రీనివాసన్ ఊటీ వెళ్లినట్లు తెలుస్తోంది. అనేక వివాదాలు, ఆర్థిక సమస్యలతో శ్రీనివాసన్ తీవ్రమైన చిక్కుల్ని ఎదుర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











