Dhanush: ధనుష్ ఎవరి కొడుకు? ధనుష్ పుట్టుకపై వివాదమేంటీ.. కోర్టు ఏం తేల్చిందంటే?
కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా, విలక్షణ నటుడిగా వెలుగొందుతున్నారు ధనుష్. ఎలాంటి పాత్ర చేసినా ఆయన అందులో ఒదిగిపోతాడు. తెరపై పాత్రే కనిపిస్తుంది కానీ.. ధనుష్ కనిపించడు. వైవిధ్యానికి పెద్దపీట వేస్తూ.. పాత్రకు తగినట్లుగా తనను తాను మలచుకోవడం ఆయన ప్రత్యేకత. వయసుకు మించిన పాత్రలే కాదు.. చిన్న వయసు లాంటి రోల్స్‌లోనూ ధనుష్ జీవించేస్తాడు. లవ్, కామెడీ, యాక్షన్ ఇలా ఏ జోనర్ అయినా చితక్కొట్టేస్తాడు ధనుష్. అలాంటి ఈ స్టార్ హీరో పుట్టుక, తల్లిదండ్రులకు సంబంధించి వివాదం రేగడం చిత్ర పరిశ్రమలో కలకలం రేగింది. వ్యవహారం కోర్టుల వరకు వెళ్లగా.. న్యాయస్థానం ఏం తేల్చింది? ఈ వివరాల్లోకి వెళితే..
చెఫ్ కావాలనుకుని హీరోగా
కస్తూరి రాజా, విజయలక్ష్మీ దంపతులకు 1983 జూలై 28న ఎగ్మోర్‌లో జన్మించారు ధనుష్. ఆయన పూర్తిపేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. సినిమాల్లోకి వచ్చాక తన స్టేజ్ నేమ్‌ను ధనుష్‌గా మార్చుకున్నారు. ఆయన తండ్రి తమిళ దర్శక నిర్మాత కస్తూరి రాజా. ధనుష్ సోదరుడు సెల్వ రాఘవన్ ప్రముఖ దర్శకుడిగా ఉన్నారు. హోటల్ చెఫ్ కావాలనుకున్న ధనుష్ తండ్రి బలవంతం మేరకు నటుడిగా మారారు. 2002లో తుల్లువదో ఇలమై సినిమాలో హీరోగా సినిమాల్లో ప్రవేశించారు. 2004లో సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు యాత్ర రాజా సంతానం. అనివార్య కారణాలతో ధనుష్- ఐశ్వర్యలు గతేడాది పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.

ధనుష్ మా కొడుకే
ధనుష్ కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న దశలో మధురై జిల్లా మేలూరుకు చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు .. ధనుష్ తమ కొడుకేనని అతని పేరు కలై సెల్వన్ అంటూ 2015లో మేలూరు కోర్టులో కేసు వేశారు. చదువుకుంటున్న రోజుల్లో ధనుష్ ఇంట్లో నుంచి పారిపోయాడని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందుకు ఆధారాలుగా బర్త్ సర్టిఫికేట్, టెన్త్ క్లాస్ టీసీ, 2002లో ఎంప్లాయిమెంట్ ఆఫీస్‌లో ధనుష్ రిజిస్ట్రేషన్‌ను చూపిస్తూ కోర్టులో దాఖలు చేశారు. ఈ వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. ఇన్నాళ్లు కస్తూరి రాజా కొడుకుగా ఉన్నది ధనుష్ కాదా అంటూ ఇండస్ట్రీ జనాలు అనుమానాలు వ్యక్తం చేశారు. కదిరేశన్ దంపతులు ఏమాత్రం తగ్గకుండా దాదాపు పదేళ్ల పాటు న్యాయపోరాటం చేయడం కూడా ఇందుకు బలం చేకూర్చింది.
డీఎన్ఏ టెస్టులకైనా సిద్ధం
అయితే కదిరేశన్, మీనాక్షి దంపతులు కేవలం డబ్బు కోసమే ధనుష్‌ను తమ కొడుకంటూ వాదిస్తున్నారని హీరో తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కదిరేశన్ దంపతులు సమర్పించిన టీసీలో ఉన్న పుట్టుమచ్చలు ధనుష్‌కు లేవని పేర్కొన్నారు. వృద్ధాప్యంలో తాము కొడుకుతో కలిసి జీవించాలని అనుకుంటున్నామని.. ధనుష్ తమ కుమారుడే అని చెప్పడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయని కదిరేశన్ దంపతులు స్పష్టం చేశారు. అవసరమైతే డీఎన్ఏ పరీక్షలకు కూడా తాము సిద్ధమేనని కోర్టుకు విన్నవించారు ఈ దంపతులు.
పదేళ్ల పాటు సాగిన విచారణ
అయితే కదిరేశన్ దంపతులు వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌లో ధనుష్ కేసు వేశారు. కొన్నేళ్ల పాటు సాగిన ఈ కేసులో సుదీర్ఘ విచారణల అనంతరం 2024 మార్చి 14న న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. ధనుష్ వారి కొడుకే అనేందుకు కదిరేశన్ దంపతులు సమర్పించిన సాక్ష్యాధారాలు సరైనవి కావంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో ధనుష్ అతని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ తీర్పుపై తీవ్ర మనస్తాపానికి గురైన కదిరేశన్ మంచానపడ్డారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం విషయమించడంతో మధురైలోని రాజాజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ కదిరేశన్ తుదిశ్వాస విడిచారు. అలా కోలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశమైన వ్యవహారం కోర్టు తీర్పుతో సద్దుమణిగింది.


Click it and Unblock the Notifications











