పుకార్లపై ధనుష్ రియాక్షన్.. రజినీ సర్‌ని సంప్రదిస్తాం అంటూ
హీరోగా చేస్తూనే సినిమా నిర్మాణ కార్యక్రమాల్లోనూ బిజీ అవుతున్నారు నేటితరం యువ హీరోలు. ఈ నేపథ్యంలో వండర్ బార్ ఫిలింస్ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించారు తమిళ హీరో ధనుష్. ఇటీవలే ఈ బ్యానర్ పై నిర్మితమైన 'కాలా' సినిమా విడుదలైంది. ధనుష్ మామ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఆశించిన మేర ఫలితం రాబట్టలేక పోయింది. పైగా ఆ సినిమా తర్వాత ఈ బ్యానర్ నుంచి మరే సినిమా రాకపోవడంతో ధనుష్ నిర్మాణ సంస్థ మూతపడిందనే రూమర్స్ పుట్టుకొచ్చాయి.
గత కొంతకాలంగా ధనుష్ నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిలింస్ క్లోజ్ అయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాలా ఫ్లాప్ కావడంతో ధనుష్ చేతులెత్తేశాడని, వండర్ బార్ ఫిలింస్ నుంచి ఇక సినిమాలు వచ్చే ఛాన్స్ లేదనే టాక్ బలంగా వినిపించింది. రోజురోజుకూ ఈ వార్తల తాకిడి ఎక్కువ కావడం గమనించిన ధనుష్ తాజాగా మీడియా ముందుకొచ్చి తన వండర్ బార్ ఫిలింస్ బ్యానర్ విషయమై స్పందించాడు. తన నిర్మాణ సంస్థ మూతపడిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు.

ఈ సందర్బంగా ధనుష్ మాట్లాడుతూ.. ''ఎలాంటి సంస్థలకైనా విజయం, అపజయం అనేవి ఎదురవుతూనే ఉంటాయి. ఎంతో మంది నిర్మాతలు ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు మాత్రమే చేస్తుంటారు. అలాగని వారు నిర్మాణ వృత్తికి దూరంగా ఉంటున్నట్లు కాదుగా. ఇప్పటివరకు మా బ్యానర్‌లో రూపొందిన చిత్రాలన్నీ మంచి ఫలితాలనే రాబట్టాయి. మంచి స్క్రిప్ట్ దొరికిన వెంటనే రజనీ సర్‌ను సంప్రదిస్తాం. ఆయనతో మా బ్యానర్‌లో మరో సినిమా ఖచ్చితంగా చేస్తాం. మా నిర్మాణ సంస్థ మూతపడిందని వస్తున్న వార్తలన్నీ రూమర్స్ మాత్రమే'' అని అన్నాడు.


Click it and Unblock the Notifications











