కమల్ హాసన్ కూతురికి భయంకరమైన వ్యాధి.. ఆఫర్లు పోతాయని, సీక్రెట్‌గా
చిత్ర పరిశ్రమలో నటీనటులు రాణించడం వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. బాధను పంటి బిగువున భరిస్తూ నటిస్తుంటారు. ఎన్ని సమస్యలున్న వాటిని మేకప్ వెనుక దాచేసి కెమెరా ముందుకెళ్లిపోతారు నటీనటులు. తమకున్న సమస్యలను బయటపెడితే ఆఫర్లు రావేమోనని, చిన్న చూపు చూస్తారేమోనన్న భయంతో మౌనం దాలుస్తుంటారు. కెరీర్ చివరి దశలో ఉన్నప్పుడే వీటిని బయటపెడతారు. తాజాగా తనకున్న అనారోగ్య సమస్యను బయటపెట్టారు సీనియర్ నటి సుహాసిని మణిరత్నం.
తెలుగు అమ్మాయి కాకపోయినా తన నటనతో తెలుగు రాష్ట్రాల్లో చెరిగిపోని స్థానం సంపాదించారు సుహాసిని మణిరత్నం.సుహాసిని తండ్రి చారుహాసన్.. వీరిది కళాకారుల కుటుంబం. చంద్రహాసన్, కమల్ హాసన్‌లు స్వయానా ఆమెకు బాబాయిలు. ఈ కుటుంబంలో అంతా దర్శకులుగా, నటులుగా, నిర్మాతలుగా రాణించినవారే. సుహాసిని చదువుకునే రోజుల్లోనే కమల్ హాసన్ తన విలక్షణ నటనతో దక్షిణాదిని ఊపేస్తున్నారు. దాంతో సుహాసిని కూడా నటన వైపు వెళ్లారు. తొలుత దిగ్గజ దర్శకుడు బాలు మహేంద్ర వద్ద సినిమాటోగ్రఫీలో శిక్షణ తీసుకున్నారు.
అందంతో పాటు చలాకీతనం, పైగా సినీ నేపథ్యం ఉండటంతో పలువురి కళ్లలో పడ్డ సుహాసిని నటిగా మారారు. మౌనగీతం చిత్రంతో నటిగా మారిన ఆమె కొత్త జీవితాలు సినిమాతో తెలుగువారిని పలకరించారు. నాటి అగ్రనటులు కృష్ణ, శోభన్ బాబులతో నటించే అరుదైన అవకాశం సుహాసిని అందుకున్నారు. ఇక చిరంజీవి, బాలకృష్ణకు హిట్ పెయిర్‌గా నిలిచారు సుహాసిని. వీరిద్దరితో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఆమె.. నాగార్జున, వెంకటేశ్‌లతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. హీరోయిన్‌గానే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ సుహాసిని తనదైన ముద్రవేశారు. సంసారం ఒక చదరంగం, స్రవంతి, గౌతమి, లాయర్ సుహాసిని తదితర చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు.

దిగ్గజ దర్శకుడు మణిరత్నంను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సుహాసిని. ఈ దంపతులకు నందన్ అనే కుమారుడు ఉన్నాడు. తన నవ్వుతో 80వ దశకంలో కుర్రాళ్ల కలల రాకుమారిగా నిలిచిన సుహాసిని.. స్వాతి, నువ్వునాను నచ్చావ్ చిత్రాలతో నంది అవార్డులను అందుకున్నారు. సింధు భైరవి చిత్రానికి గాను 1985లో జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని దక్కించుకుని సత్తా చాటారు. పెణ్, ఇందిరా, పుదమ్ కాదు కాలై చిత్రాలకు దర్శకురాలిగా.. తిరుడా తిరుడా, ఇరువర్, రావణన్ చిత్రాలకు రైటర్‌గానూ సేవలందించారు.
ఇటీవల వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న సుహాసిని.. తాజాగా ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ తనకున్న అనారోగ్య సమస్యను పంచుకున్నారు. తాను క్షయ వ్యాధి (టీబీ)తో బాధపడ్డానని.. అయితే ఈ విషయాన్ని బయటపెడితే పరువు పోతుందని , సీక్రెట్‌గా ట్రీట్‌మెంట్ తీసుకున్నట్లు సుహాసిని చెప్పింది. ఆరేళ్ల వయసులో తొలిసారిగా తనకు టీబీ బయటపడిందని. తర్వాత 36 ఏళ్ల వయసులో మరోసారి వ్యాధి తిరగబెట్టిందని తెలిపారు. వ్యాధి కారణంగా విపరీతంగా బరువు తగ్గి.. వినికిడి శక్తి కూడా కోల్పోయినట్లుగా సుహాసినీ చెప్పారు. మెరుగైన వైద్యం తీసుకుని తిరిగి కోలుకున్నానని.. టీబీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నానని సుహాసిని తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











