డిజాస్టర్లు తీసినా తగ్గని శంకర్ క్రేజ్.. 1000 కోట్లతో కొత్త సినిమా.. అవతార్ రేంజ్‌లో!
డైరెక్టర్ శంకర్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. భారతదేశం గర్వించదగ్గ అతికొద్దిమంది దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. తన భారీ చిత్రాలతో, టెక్నికల్ వండర్స్‌తో భారతీయ సినిమాను హాలీవుడ్‌కు రేంజ్‌కు తీసుకెళ్లారు శంకర్. కమర్షియల్ సినిమాలా కనిపించినా.. అందులో సామాజిక కోణం ఉండేలా చిత్రాలను తీయడంలో శంకర్ సిద్ధహస్తుడు. అలాంటి ఈ దర్శక దిగ్గజం గత కొన్నేళ్లుగా వరుస డిజాస్టర్లు ఇస్తున్నాడు. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాల రిజల్ట్‌తో శంకర్ పని అయిపోయినట్లేనని ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరిగింది. ఇలాంటి వారందరికీ తన కొత్త సినిమాతో షాకిచ్చారు శంకర్. ఈ వివరాల్లోకి వెళితే..
బాక్సాఫీస్‌ను వణికించిన శంకర్
బడ్జెట్ నుంచి సినిమా మేకింగ్ వరకు భారతీయ సినీరంగంలో ఉన్న అపోహలను బద్ధలు కొట్టారు శంకర్. భారతీయులు తలచుకుంటే హాలీవుడ్‌ను మించేలా సినిమాలు తీయగలరని నిరూపించారు. బలమైన కథలకు తోడు విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, హై టెక్నికల్ వాల్యూస్‌తో భారతీయ సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు. పాటల మేకింగ్‌కే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిస్తాడనే విమర్శలు వచ్చినా.. ఆ పాటలతోనే సినిమాలను హిట్ చేయించిన ప్రతిభావంతుడు శంకర్.

వరుస ఫ్లాప్స్‌తో శంకర్ సతమతం
కొన్నేళ్లపాటు ఓటమి ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయనకు 2012లో త్రీ ఇడియట్స్ రీమేక్ నుంచి పతనం ప్రారంభమైంది. ఆ వెంటనే ఐ, 2.0, భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ వంటి వరుస డిజాస్టర్లతో అప్రతిష్ట మూటకట్టుకోవడంతో పాటు నిర్మాతలకు వందల కోట్ల నష్టాలను మిగిల్చింది. రామ్ చరణ్‌తో తీసిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ కావడంతో శంకర్ సినీ ప్రస్థానం ముగిసినట్లేనని కామెంట్స్ వచ్చాయి. ప్రస్తుతం కమల్ హాసన్‌తో తీస్తోన్న ఇండియన్ 3 భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ చిత్రం థియేటర్‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుందని గాసిప్స్ వైరల్ అయ్యాయి. దీంతో ఎలాంటి శంకర్.. ఎలా అయిపోయాడు.. చివరికి సినిమాను నేరుగా థియేటర్‌లోకి రిలీజ్ చేసుకోలేని స్థితికి దిగజారిపోయాంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.
శంకర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ వెల్పరి
వీటిని పక్కనపెడితే కనీసం నిర్మాతలు కూడా శంకర్‌తో సినిమాలు నిర్మించేందుకు ముందుకు వస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాతలే కాదు హీరోలు కూడా శంకర్‌తో సినిమా అంటే ఒకటి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు శంకర్ సినిమాలో చిన్న వేషం దొరికినా అదే అదృష్టం అనుకునేవారు హీరోలు.. కానీ ఇప్పుడది గత వైభవంగా నిలిచింది. అయితే ఇలాంటి ఊహాగానాలకు చెక్ పెట్టారు దర్శకుడు శంకర్. తమిళ నవల వెల్పరి ఆధారంగా తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఓ కార్యక్రమంలో ఏకంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ ముందు శంకర్ ఈ ప్రకటన చేశారు.
మరో అవతార్‌లా వెల్పరి
కోవిడ్ సమయంలో సు. వెంకటేశన్ రాసిన వెల్పరి నవలను చదవగా అది తనకు బాగా నచ్చేసిందని, అప్పుడే ఈ నవల రైట్స్ తీసుకుని స్క్రీన్ ప్లే రాసుకున్నానని అది చాలా బాగా వచ్చిందని శంకర్ తెలిపారు. 3 భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తానని వెల్లడించారు. రోబో అనేది ఒకప్పుడు తన కలల ప్రాజెక్ట్ అని.. ఇప్పుడు వెల్పరి కూడా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నారు శంకర్. అవతార్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్ మేకింగ్‌ను, టెక్నాలజీని ఈ చిత్రం ద్వారా భారతీయ సినీ పరిశ్రమకు పరిచయం చేయొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
హీరో ఎవరు?
1000 కోట్ల ఈ సినిమాను కరణ్ జోహార్, నెట్‌ఫ్లిక్స్, పెన్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మించే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్ సినిమా కావడంతో ఈ చిత్రం కోసం భారీ స్టార్ క్యాస్టింగ్‌ను ప్లాన్ చేస్తున్నారట శంకర్. కన్నడ స్టార్ హీరో యశ్‌ను ఆల్రెడీ శంకర్ సంప్రదించినట్లుగా గాసిప్స్ వస్తున్నాయి. మరి ఈ సినిమాతోనైనా శంకర్ కమ్ బ్యాక్ ఇస్తారా? అలాగే తమిళ చిత్ర పరిశ్రమకు కలగా ఉన్న 1000 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను కూడా సాధిస్తారా? అంటూ కథనాలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











