షాకింగ్ న్యూస్ : 'విశ్వరూపం'పై నిషేధం, ప్రభుత్వ ప్రకటన
చెన్నై: కమల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం 'విశ్వరూపం'. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈనెల 25న విడుదల కానున్న 'విశ్వరూపం' చిత్రంపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. దాంతో తెలుగులో కూడా రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహాలు ముసురుకుంటున్నాయి. ఇది ఊహించని పరిణామని అంతా వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ చిత్రంలో తమ మనోభావాలను గాయపరిచేలా సన్నివేశాలున్నాయంటూ బుధవారం నగరంలోని నలభైకి పైగా ముస్లిం సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీని నిర్వహించాయి. 'విశ్వరూపం' చిత్రం రాష్ట్రంలో విడుదల కాకుండా నిషేధం విధించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. దీంతో ఈ చిత్రంపై రాష్ట్రంలో నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
ఇండియా దేశీయ లీగ్ పార్టీకి చెందిన కొంతమంది చెన్నైలోని కమల్‌హాసన్ కార్యాలయం ఎదుట గుమికూడారు. 'విశ్వరూపం'కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కమల్‌హాసన్ చిత్రపటాలకు నిప్పుపెట్టారు. తమిలనాడు ముస్లిం మున్నేట్ర కజగం ప్రెసిడెంట్, ఎమ్మెల్యే ఎం.హెచ్. జవహిరుల్లా ఈ విషయమై మాట్లాడుతూ...వివిధ ముస్లిం మత సంస్థల ప్రతినిధులు చెన్నయ్ నగర పోలీస్ కమీషనర్ ఎస్ జార్జ్‌ను కలుసుకున్నామని, ఈ సినిమా ప్రదర్శన కాకుండా నిలిపి వేయాలని డిమాండ్ చేసామని తెలిపారు.
సినిమాలో తమ మనో భావాలు దెబ్బతీసే విధంగా సన్ని వేశాలు ఉన్నాయనే అనుమానం ఉన్నందున...విడుదలకు ముందే తమకు ప్రత్యేక షో వేసి చూపాలని కొన్ని రోజులుగా ముస్లిం సంఘాల నేతలు కమల్ హాసన్ ను డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే కమల్ హాసన్ నుంచి ఎలాంటి స్పందన రాక పోవడంతో వారు తాజాగా ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేసారు.


Click it and Unblock the Notifications











