షూటింగ్ స్పాట్ నుంచి పారిపోయిన హీరో, హీరోయిన్.. భయంతో పరుగులు పెట్టిన చిత్ర యూనిట్!
రెండు గ్యాంగ్ లు గొడవ పడుతుంటే హీరో వెళ్లి ఆపుతాడు. లేకుంటే ఆయుధం చేతపట్టి తాను కూడా పోరాటంలోకి దూకుతాడు. ఇదంతా సినిమాల్లో మాత్రమే జరుగుతుంది. నిజంగానే ఇలాంటి సంఘటన హీరో, హీరోయిన్ కు ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుంది. అలంటి సంఘటనే చెన్నై నగర శివారులో చోటు చేసుకుంది. హీరో జివి ప్రకాష్, హీరోయిన్ అబర్నతికి చేదు అనుభవం ఎదురైంది.

జైల్ షూటింగ్
అబర్నతి, జివి ప్రకాష్ జంటగా జైల్ అనే చిత్రాల్లో నటిస్తున్నారు. వసంత బాలన్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాల్ని చెన్నైలోని కన్నంగి నగర్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు ఊహించని సంఘటన ఎదురైంది.

వేటకొడవళ్లతో
చెన్నైలో నేరాలు, హత్యలు ఎక్కువగా జరిగే ప్రాంతం అది. హీరో, హీరోయిన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఊహించని ఘటన ఎదురైంది. రెండు గ్యాంగ్స్ వేటకొడవళ్లతో దాడి చేసుకుంటూ షూటింగ్ స్పాట్ వైపు పరుగులు తీశారు. దీనితో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హీరో జివి ప్రకాష్, హీరోయిన్ అబర్నతి పరుగులు తీసినట్లు తెలుస్తోంది.

ఇంట్లో దాక్కున్నారు
దూరంగా వెళ్లి వీరిద్దరూ ఓ ఇంట్లో దాక్కున్నారు. చిత్ర యూనిట్ కూడా షూటింగ్ కు సంబందించిన వస్తువులన్నీ తీసుకుని పరుగులు పెట్టింది. దాదాపు 2 గంటల పాటు ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. పోలీసులు రంగంలోకి దిగాకే అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది.

యధావిధిగా
అల్లర్లు సద్దుమణిగాక ఎక్కడెక్కడో తలదాచుకున్న చిత్ర యూనిట్ లోని సభ్యులు, హీరో, హీరోయిన్ షూటింగ్ స్పాట్ కి చేరుకున్నారు. ఆ తరువాత యధావిధిగా షూటింగ్ తిరిగి ప్రారంభించారు.


Click it and Unblock the Notifications











