హీరోయిన్‌కు ప్రేమ పేరుతో హీరో వేధింపులు... తల పట్టుకున్న నిర్మాతలు!
సినిమా మొదలు పెట్టింది మొదలు అది థియేటర్లలోకి వచ్చే వరకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నిర్మాతలకే తెలుసు. చిన్న సినిమాల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. అన్ని ఆటంకాలను అధిగమించి సినిమా విజయం సాధిస్తే తప్ప నిర్మాతలు గట్టెక్కే పరిస్థితులు ఉండదు.
అయితే కొన్ని సార్లు నిర్మాతలు ఊహించని పరిస్థితులు రిలీజ్ వేళ ఇబ్బందిగా మారుతాయి. తాజాగా ఓ తమిళ సినిమా విషయంలో హీరో హీరోయినే పెద్ద సమస్యగా మారారట. హీరోయిన్‌ను హీరో ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

ఇబ్బందుల్లో మయూరన్ మూవీ
ప్రముఖ తమిళ దర్శకుడు బాలా వద్ద అసిస్టెంటుగా పని చేసిన నందన్ సుబ్బరాయన్ దర్శకుడిగా పరిచయం అవుతూ రూపొందించిన చిత్రం ‘మయూరన్'. ఈ చిత్రంలో అముదవానన్ హీరోగా, ఫెమీనా మిస్ ఇండియా అశ్మిత హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కాబోతోంది. హీరో హీరోయిన్ మధ్య గొడవ కారణంగా ఇద్దరూ ప్రమోషన్లకు రావడం లేదట.

హీరో మీద ఫిర్యాదు చేసిన హీరోయిన్ తల్లి
తన కూతురును హీరో అముదవానన్ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని, అశ్మిత కోటీశ్వరురాలు కావడంతో ఆమెను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడంటూ.... ఆమె తల్లి నిర్మాతలకు ఫిర్యాదు చేసింది. అంతే కాదు అతడు వస్తే తన కూతురు సినిమా ప్రమోషన్లకు రాదని తేల్చి చెప్పింది.

హీరోయిన్ రాకుండా హీరో ఎలా వస్తాడు?
హీరోయిన్ రాకుండా హీరో సినిమా ప్రమోషన్లకు ఎలా వస్తాడు? ఆమె రాకుంటే నేను కూడా రాను అంటూ అముదవానన్ కూడా భీష్మించుకుని కూర్చున్నాడట. తాను ఎవరినీ వేధించ లేదని, తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారంటూ అతడు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

తల పట్టుకున్న నిర్మాతలు
ఈ హీరో హీరోయిన్ గొడవ నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. అసలే తమది చిన్న సినిమా... బరిలో జ్యోతిక నటించిన జాక్ పాట్ మూవీతో పాటు మరిన్ని చిత్రాలు ఉన్నాయి. హీరో హీరోయిన్ సరైన ప్రమోషన్ చేయక పోవడంతో తమ సినిమాకు మరింత నష్టం కలిగిస్తుందని భయపడుతున్నారట.


Click it and Unblock the Notifications











