ఓ అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నా, షాకిచ్చిన విశాల్.. పెళ్లి డేట్ చెప్పేసిన స్టార్ హీరో
దక్షిణాది చిత్ర పరిశ్రమలోని మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే ఖచ్చితంగా కనిపించే పేరు హీరో విశాల్. ఇప్పటికే హాఫ్ సెంచరీకి దగ్గరైన విశాల్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా? అని అభిమానులు, సినీ ప్రముఖులు ఎదురుచూస్తున్నారు. విశాల్ పెళ్లి, ప్రేమలపై గతంలో ఎన్నోసార్లు పుకార్లు వచ్చాయి. అయితే అవన్నీ గాలి వార్తలుగా మిగిలిపోయాయి. తాజాగా తన పెళ్లిపై హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
కోలీవుడ్‌లో సత్తా చాటిన తెలుగు కుర్రాడు
విశాల్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు వాడైన ఆయన కోలీవుడ్‌లో బలంగా జెండా పాతారు. చెల్లమే చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విశాల్‌కు లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన సందైకోడి మూవీ మాస్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడంతో కోలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగారు విశాల్. ఆయన సినిమాలు డబ్బింగ్ ద్వారా తెలుగు వారిని కూడా ఆకట్టుకుని ఇక్కడా ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

విశాల్‌పై రగిలిపోతున్న కొందరు
అయితే తెలుగువాడైన విశాల్.. తమిళనాడులో దూసుకెళ్తుండటంతో కొందరు తమిళ పెద్దలు రగిలిపోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఎన్నోసార్లు అడ్డుకోవాలని, సినిమాలపై నిషేధం విధించాలని కూడా ప్రయత్నించి వారంతా విఫలమయ్యారు. నటుడిగా ఎదిగిన విశాల్.. తన తోటి కళాకారులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో దక్షిణ భారత చలన చిత్ర నటీనటుల అసోసియేషన్ (నడిగర్ సంఘం) ఎన్నికల్లో విజయం సాధించి షాకిచ్చారు. విషయం ఏదైనా సరే దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం విశాల్ స్టైల్. అవి కొన్నిసార్లు మిస్ ఫైర్ కావడంతో పలువురికి శత్రువుగానూ మారారు.
పలువురు హీరోయిన్స్‌తో విశాల్ ప్రేమాయణం?
ఇకపోతే అందరు హీరోల మాదిరిగానే విశాల్ వ్యక్తిగత జీవితంపైనా పలుమార్లు రూమర్స్ వచ్చాయి. వరలక్ష్మీ శరత్ కుమార్, అభినయ, లక్ష్మీమీనన్, అనీషా రెడ్డి, రీమాసేన్ తదితర హీరోయిన్లతో విశాల్ ప్రేమాయణం సాగించారని కోలీవుడ్ మీడియా కోడై కూసింది. అన్నింటిలోకి వరలక్ష్మీ, అభినయలతో విశాల్ పెళ్లి వరకు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. వరలక్ష్మీ, అభినయలకు పెళ్లిళ్లు అయిపోవడంతో ఈ ఊహాగానాలకు చెక్‌పడి విశాల్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే తన పెళ్లి వార్తలకు స్వయంగా విశాల్ చెక్ పెట్టారు. త్వరలో తాను ఓ ఇంటివాడిని కాబోతున్నట్లు తెలిపారు.
ఆగస్ట్ 29న విశాల్ కీలక ప్రకటన
నడిగర్ సంఘం భవనం పూర్తయ్యాకే తాను పెళ్లి చేసుకుంటానని విశాల్ గతంలో అగ్రహీరోలు కమల్ హాసన్, రజనీకాంత్ తదితర పెద్దల సమక్షంలో శపథం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదరైనా సరే నిర్మాణాన్ని పూర్తి చేస్తానని చెప్పారు. ప్రస్తుతం ఈ భవనం పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో రెండు మూడు నెలల్లో పనులు పూర్తి చేసి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15 నాటికి ప్రారంభించాలని విశాల్ లక్ష్యంగా పెట్టుకున్నారు. కొన్ని నెలలుగా నా ప్రేమాయణం సాగుతోందని, నా ప్రియురాలు ఎవరో త్వరలోనే చెబుతానని ఆగస్ట్ 29న నా పుట్టినరోజు కాబట్టి ఆరోజు పెళ్లి గురించి ప్రకటిస్తానని విశాల్ చెప్పడంతో కోలీవుడ్ షాకైంది. మొత్తానికి విశాల్ ఓ ఇంటివాడు కాబోతుండటంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్ట్ 29న ఈ స్టార్ హీరో ఎలాంటి ప్రకటన చేస్తారోనని సినీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి.


Click it and Unblock the Notifications











