రజనీకాంత్ బయోపిక్‌లో హీరో ఎవరు? ధనుష్ కాకుండా మరో ఇద్దరు పేర్లు తెరపైకి!
సూపర్‌స్టార్ రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించేందుకు రంగం సిద్ధమైంది. భారతదేశంలోని టాప్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరైన సాజిద్ నడియాద్‌వాలా .. రజనీ బయోపిక్ హక్కులు సంపాదించారు. ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్కింగ్ జరుగుతుండగా.. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ వార్తలతో తలైవా ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. అంతాబాగానే వుంది కానీ.. ఇంతకీ ఈ బయోపిక్‌లో రజనీ పాత్రలో నటించేదెవరు అంటూ సోషల్ మీడియాలో చర్చలు, వాదోపవాదాలు నడుస్తున్నాయి.
రజనీ క్యారెక్టర్ పోషించడమంటే అంత ఆషామాషీ కాదు. అది చేసే నటుడు ఆయన మేనరిజం, స్టైల్, హావభావాలు సరిగా పలికించకలేకపోతే సినిమా రిజల్ట్‌పై ప్రభావం చూపుతుంది. అంతేనా.. ఆ నటుడు, దర్శకుడు మొత్తం చిత్ర యూనిట్‌ను రజనీ ఫ్యాన్స్ చెడుగుడు ఆడుకుంటారు. కాబట్టి ఒళ్లు దగ్గరపెట్టుకుని తీయాలి. మరి అంతటి సత్తా వున్న నటుడు ఎవరు..? కొన్నిరోజుల వరకు ఈ క్వశ్చన్ ట్రెండ్ అయ్యే అవకాశం వుంది.

రజనీ క్యారెక్టర్ చేయదగ్గ నటుడు అంటూ ఓ హీరో పేరు బాగా వినిపిస్తోంది. ఆయన మరెవ్వరో కాదు. తలైవా అల్లుడు ధనుష్. దీనికి కారణాలు లేకపోలేదు. రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న ధనుష్.. ఇప్పటి వరకు ఎవరి బయోపిక్‌లోనూ నటించలేదు. తనకు అవకాశం వుంటే ఖచ్చితంగా ఇలాంటి సబ్జెక్ట్స్‌లో నటిస్తానని ఆయన పలుమార్లు చెప్పారు కూడా.
అంతేకాదు.. ఇటీవల తన సినిమా 'అత్రంగి రే' ప్రచారంలో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నకు తనకు కూడా బయోపిక్‌లో నటించాలని వుందని చెప్పాడు. అంతేకాదు.. కుదిరితే రజనీకాంత్, ఇళయరాజా బయోపిక్‌లలో నటించాలని వుందని తెలియజేశాడు. ఈ వ్యాఖ్యలు కూడా రజనీ బయోపిక్‌లో ధనుష్ నటిస్తాడు అనడానికి బలాన్ని చేకూరుస్తున్నాయి.

ఈ సంగతి పక్కనబెడితే అసలు రజనీ క్యారెక్టర్‌ను ధనుష్ చేయగలడా అన్న చర్చ జరుగుతోంది. భారతీయ సినీటుల్లో ఏ హీరోకి లేని ఓ సెపరేట్ క్వాలీటీ , ఇమేజ్ ఆయన సొంతం. ఎలివేషన్లు, కమర్షియల్ ఫార్ములాలకు దూరంగా వుండే ధనుష్ ప్రయోగాలకు పెద్దపీట వేస్తారు. పక్కింటి అబ్బాయితో మాట్లాడుతున్నట్లుగా ఆయన యాక్టింగ్ వుంటుంది తప్పించి తెరపై నటుడిని చూసినట్లుగా వుండదు. కథ బాగుండి, క్యారెక్టర్ తలకి ఎక్కిందా .. ఇక అంతే ధనుష్ ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. డైరెక్టర్ రాసుకున్న పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేయడం గ్యారెంటీ.
ఈ ట్రాక్ రికార్డు వల్లే రజనీ బయోపిక్‌లో ధనుష్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన తర్వాత విజయ్ సేతుపతి, బాలీవుడ్‌లో విక్కీ కౌశల్ పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. భారత స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ ఉదమ్ సింగ్, ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ శ్యాం బహదూర్‌ల బయోపిక్స్‌లో నటించి తనను తాను ప్రూవ్ చేసుకున్నారు విక్కీ. ఇక విజయ్ సేతుపతి టాలెంట్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ ఊహాగానాల మధ్య రజనీ బయోపిక్‌లో నటించే అవకాశం ఏ స్టార్ దక్కించుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











