మొరగని కుక్క.. విమర్శించని నోరు లేదు.. అర్ధమైందా రాజా.. వైసీపీ నేతలను రజనీ టార్గెట్ చేశారా?
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ఆగస్టు 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నది. ఈ సినిమాకు సంబంధించిన ఆడియో వేడుక తాజాగా చెన్నైలో జరిగింది. ఈ వేడుక కోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. చెన్నైలోని స్టేడియంలో నిర్వహించిన ఈ వేడుకలో దాదాపు గంట సేపు సాగిన రజనీకాంత్ స్పీచ్ రసవత్తరంగా, ఉత్తేజంగా, సంచలన విషయాలతో సాగింది.
కొన్నిసార్లు ఉల్లాసంగా మాట్లాడిన రజనీకాంత్.. మరికొన్ని సార్లు ఎమోషనల్‌గా అయ్యారు. అయితే తనదైన శైలిలో సాగిన రజనీ స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అయితే తన సుదీర్ఘమైన స్పీచ్‌లో చేసిన కొన్ని వ్యాఖ్యలు వైసీపీ నేతలను ఉద్దేశించి చేసినవని సోషల్ మీడియాలో నెటిజన్లు రజనీకాంత్ వీడియోను ట్వీట్ చేస్తున్నారు. రజనీ స్పీచ్‌లో ఏమన్నాడు? గతంలో వివాదం ఏమిటి అనే విషయంలోకి వెళితే..

కొద్ది నెలల క్రితం విజయవాడలో జరిగిన స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ గురించి, ఆయనతో అనుబంధం గురించి, అలాగే నందమూరి బాలకృష్ణ గురించి చెప్పుకొన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు విజన్, అలాగే భవిష్యత్‌లో ఆయన అనుసరించబోయే ప్లాన్స్ గురించి గొప్పగా చెప్పారు.
చంద్రబాబు విజన్ వల్లే ప్రస్తుతం హైదరాబాద్ నగరం అమెరికాగా మారిపోయింది. ఐటీ ఇండస్ట్రీ రావడంతో నగర రూపు రేఖలు అంతర్జాతీయ స్థాయికి మారిపోయాయి. అలాగే రాబోయే రోజుల్లో ఆయన చెప్పిన విజన్ వింటే.. దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నంబర్ వన్ స్థాయికి చేరుకొంటుంది అని చంద్రబాబుపై రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు.

అయితే చంద్రబాబును ఆకాశానికి ఎత్తేయడంతో రజనీకాంత్‌పై వైసీపీ శ్రేణులు, నేతలు భారీగా విమర్శలు గుప్పించారు. రజనీకాంత్ సూపర్ స్టార్ తెలుగు వారికి కాదు. తమిళవారికే సూపర్ స్టార్ అంటూ కామెంట్లు చేశారు. చంద్రబాబు తొత్తులా మాట్లాడారని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. అలాగే సిల్క్ స్మిత మరణానికి కారణం అంటూ వైసీపీ అనుకూల నెటిజన్లు సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు.
ఇలాంటి వివాదాల నేపథ్యం మధ్య తాజాగా రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. జైలర్ సినిమా ఈవెంట్ లో రజనీకాంత్ మాట్లాడుతూ.. మొరగని కుక్కలేదు. విమర్శించని నోరు లేదు. ఇవి రెండు జరగని ఊరు లేదు. అయినా మనం పట్టించుకోవద్దు. ఇలాంటి పట్టించుకోకుండా మన పని చూసుకొంటూ ముందుకు పోతూనే ఉండాలి అని రజనీకాంత్ అన్నారు. అర్ధమైందా రాజా అంటూ తనదైన శైలిలో పంచ్ ఇచ్చారు. దాంతో అభిమానులు కేరింతలు, అరుపులతో స్టేడియాన్ని దద్దరిల్లేలా చేశారు.
అయితే రజనీకాంత్ మాటలకు అనిరుధ్, రమ్యకృష్ణ, కళానిధి మారన్, కావ్య మారన్, ఇతర నటీనటులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. వారితో పాటు అభిమానులు ఆనందం ఆకాశానికి అంటింది. తాజాగా కొందరు టీడీపీ అనుకూల వర్గం రజనీకాంత్ స్పీచ్ వైసీపీ నేతలను ఉద్దేశించిందే. ఆయన సరైన విధంగా వారికి జవాబు ఇచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











