G. Marimuthu: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. జైలర్ నటుడు కన్నుమూత
ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సినీ పరిశ్రమల్లోనూ వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రెండు మూడు నెలల వ్యవధిలోనే ఎన్నో మంది పెద్ద పెద్ద నటులు, టెక్నీషియన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు ఇలా సినీ రంగంతో సంబంధం ఉన్న చాలా మంది మరణించారు. అందులోనూ హార్ట్‌కు సంబంధించిన కారణంగా పలువురు కన్నుమూశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కోలీవుడ్‌కు చెందిన సీనియర్ దర్శకులు, నటుడు జీ మరిముత్తు మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు, నటులు ధృవీకరించారు.
దాదాపు ఇరవై ఐదేళ్లుగా దర్శకుడిగా, నటుడిగా సినీ రంగానికి విశిష్టమైన సేవలు అందించిన జీ మరిముత్తు (57) గత శుక్రవారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గమనించే లోపే ఆయన ప్రాణాలు కోల్పోయారని తెలిసింది. అయినప్పటికీ ఆయనను దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా.. మరిముత్తు అప్పటికే మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారట. ఇక, ఈయన మరణంపై సినీ ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన జీ మరిముత్తు చాలా చిత్రాలకు పని చేశారు. ముఖ్యంగా అజిత్ నటించిన 'ఆసై' మూవీతో ఆయనకు పేరు వచ్చింది. ఒకవైపు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తోన్న సమయంలోనే అంటే 1999లో ఆయన 'వాలి' అనే చిత్రంతో నటుడిగానూ పరిచయం అయ్యారు. అలా సుదీర్ఘమైన కెరీర్‌లో వందకు పైగా సినిమాల్లో నటించారు. అందులో చాలా చిత్రాలకు గానూ అవార్డులను కూడా అందుకున్నారు. తన సినీ ప్రయాణంలో జీ మరిముత్తు 'కన్నుమ్ కన్నుమ్', 'పులివాల్' అనే సినిమాలను కూడా తెరకెక్కించారు.
ఒకవైపు సినీ రంగంలో రాణిస్తూ ఉండగానే జీ మరిముత్తు బుల్లితెరపైకి సైతం ఎంట్రీ ఇచ్చారు. అందులో కొన్ని షోలు, సీరియళ్లలో నటించారు. ఈ మధ్య కాలంలో కొన్ని వెబ్ సిరీస్‌లలోనూ ఆయన కనిపించారు. ఇక, ఇటీవలే విడుదలైన సెన్సేషనల్ హిట్ అయిన 'జైలర్' మూవీలోనూ మరిముత్తు నటించారు. అలాగే, త్వరలో రాబోతున్న 'ఇండియన్ 2'లోనూ ఆయన కీలక పాత్రను చేసినట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications











