జన నాయగన్ విడుదల వాయిదా.. విజయ్ సినిమా రిలీజ్ ఆగిపోవడం వెనుక కారణాలు అవేనా?
అనుకున్నదే అయ్యింది.. కోలీవుడ్ సూపర్‌స్టార్, దళపతి విజయ్ నటించిన జన నాయగన్ మూవీ విడుదల ఆగిపోయింది. కొన్ని అనుకోని పరిస్ధితుల కారణంగా జన నాయగన్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ పరిణామాలతో దళపతి అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. విజయ్ లాంటి సూపర్‌స్టార్ నటించిన సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటీ. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పరిణామాలను పరిశీలిస్తే...
జన నాయగన్ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. దళపతి విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. మమితా బైజు, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, రెబా మోనికా జాన్, సునీల్, మోనిషా బ్లెస్సీ, నిళగల్ రవి, రేవతి, శ్రీకాంత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కేలు జన నాయగన్ మూవీని దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా, ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్, అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

దాదాపు మూడు దశాబ్ధాలుగా తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా తన నటన, వ్యక్తిత్వంతో కోట్లాది మంది అభిమానాన్ని పొందారు దళపతి విజయ్. తనన ఇంతటివాడిని చేసిన ప్రజల కోసం ఆయన టీవీకే పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇందుకోసం జన నాయగన్ తన చివరి చిత్రమని ఆయన అధికారికంగా ప్రకటించారు. దాంతో ఈ సినిమాపై తొలి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు సంక్రాంతికి రానుండటంతో భారీ కలెక్షన్స్ గ్యారెంటీ అని అంతా అనుకున్నారు. జనవరి 9న జన నాయగన్‌ను రిలీజ్ చేసేందుకు భారీ ఏర్పాట్లు కూడా చేశారు. అయితే సెన్సార్ క్లియరెన్స్ కాకపోవడం సినిమాకు అడ్డంకీగా మారింది.
జనవరి 9 రిలీజ్ కావడంతో జన నాయగన్‌ను వీక్షించిన సెన్సార్ బోర్డ్.. ఇందులోని కొన్ని సన్నివేశాలు తొలగించాలని, సంభాషణలు మ్యూట్ చేయాలని సిఫారసు చేసింది. సీబీఎఫ్‌సీ బోర్డ్ ఆదేశాల మేరకు అవసరమైన మార్పులు చేసి మళ్లీ సెన్సార్ బోర్డ్ రివ్యూకి పంపింది చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్. అయితే దీనిపై సీబీఎఫ్‌సీ బోర్డ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం వివాదానికి దారితీసింది. అంతేకాకుండా ఈ సినిమా రివ్యూని రివైజింగ్ కమిటీకి పంపించచామని, వారే జన నాయగన్‌కు సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేస్తారని సెన్సార్ బోర్డ్ అధికారులు చెప్పడంతో నిర్మాతలు షాక్‌కు గురయ్యారు.
రిలీజ్ డేట్ దగ్గరపడటం, అడ్వాన్స్ బుకింగ్ కొన్ని ఏరియాలలో మొదలవ్వడంతో నిర్మాతలపై ఒత్తిడి పెరిగిపోయింది. దాంతో సెన్సార్ బోర్డ్ తీరుపై మద్రాస్ హైకోర్టులో కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. తొలుత ఈ పిటిషన్‌ను జనవరి 6వ తేదీన విచారించాలని ధర్మాసనం భావించింది. అయితే అనివార్య కారణాలతో దానిని జనవరి 7వ తేదీన విచారించేందుకు షెడ్యూల్ చేసింది హైకోర్ట్. బుధవారం జరిగిన విచారణ సందర్భంగా సెన్సార్ బోర్డ్ తరపున సొలిసిటర్ జనరల్, కేవీఎన్ ప్రొడక్షన్స్ తరపున పరాశరన్‌లు వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఆశా తుది తీర్పును రిజర్వ్ చేశారు. జనవరి 9వ తేదీ ఉదయం తీర్పును వెలువరిస్తామని ఆదేశాలు జారీ చేశారు.
తీర్పు ఎలా వస్తుందోనన్న సందిగ్ధంతో పాటు అప్పటికప్పడు అనుకూలంగా వచ్చినా రిలీజ్ చేయడం కష్టంతో కూడుకున్న పనికావడంతో కేవీఎన్ ప్రొడక్షన్స్ ఆలోచనలో పడింది. చివరికి జన నాయగన్ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మా పరిధికి మించిన అనివార్య పరిస్ధితుల కారణంగా జన నాయగన్ విడుదల వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం. మీ అందరి సపోర్ట్ జన నాయగన్ టీమ్‌కి బలమని నిర్మాతలు ఓ నోట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నిర్ణయంతో కోట్లాది మంది విజయ్ అభిమానులు షాక్ అయ్యారు. తమ అభిమాన హీరో చివరి సినిమాను పండక్కి చూసుకోవాలని ఆశపడ్డ దళపతి ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నార్త్ అమెరికాతో పాటు కేరళ, కర్ణాటక తదితర ప్రాంతాలలో ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్న వారికి డబ్బును రీఫండ్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జన నాయగన్ రిలీజ్ ఆగిపోవడంపై దళపతి విజయ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











