జయలలిత మొండితనం.. ఆ సినిమా కోసం కమల్ హాసన్ ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా?
తమిళ దిగ్గజ నటుడు కమల్ హాసన్ నటించిన థగ్‌లైఫ్ చిత్రం జూన్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన సంగతి తెలిసిందే. దాదాపు 38 సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ - మణిరత్నం కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో థగ్‌లైఫ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్ హాసన్ సరసన త్రిష, అభిరామి జంటగా నటించగా.. కోలీవుడ్ స్టార్ హీరో శింబు కీలకపాత్ర పోషించారు. అయితే విడుదలకు ముందే ఈ థగ్‌లైఫ్ చిత్రం పలు వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పుడే కాదు కమల్ హాసన్ సినిమాలు గతంలోనూ ఎన్నో కాంట్రవర్సీలకు కేంద్రమయ్యాయి. ఈ వివరాల్లోకి వెళితే..
వివాదాల్లో థగ్‌లైఫ్
అభిరామితో కమల్ హాసన్ లిప్‌లాక్‌తో పాటు కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా కన్నడ భాషపై కమల్ చేసిన వ్యాఖ్యలను కన్నడిగులు సీరియస్‌గా తీసుకున్నారు. విషయం కోర్టు వరకు వెళ్లడంతో సినిమాను కర్ణాటకలో విడుదల చేయకుండా నిర్ణయం తీసుకున్నారు కమల్ హాసన్. కన్నడ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా థగ్‌లైఫ్‌పై నిషేధం విధించింది. తప్పు చేస్తే తాను క్షమాపణలు చెబుతానని, లేనిపక్షంలో అస్సలు తగ్గనని కమల్ స్పష్టం చేశారు. అలాంటి కమల్ హాసన్‌ని సైతం వణికించి కిందకి దిగొచ్చేలా చేశారు దివంగత తమిళనాడు మాజీ సీఎం జయలలిత.

విశ్వరూపం విడుదలకు బ్రేక్
కమల్ హాసన్ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వరూపం చిత్రం వివాదాలకు కారణమైన సంగతి తెలిసిందే. కోలీవుడ్‌ను దాటి ఏకంగా జాతీయ స్థాయిలో ఈ సినిమా చర్చనీయాంశమైంది. ఈ సినిమా టైటిల్‌తో మొదలై, ముస్లింల మనోభావాలు వంటి అంశాలతో విశ్వరూపం విడుదలకు అనేక అవరోధాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని థియేటర్‌లలో కాకుండా డైరెక్ట్ టూ హోమ్ (డీటీహెచ్) విధానంలో విడుదల చేయాలని కమల్ భావించారు. అక్కడి నుంచే సమస్యలై మొదలై థియేటర్ల యాజమాన్యాలు ఆయనపై ఒత్తిడి తెచ్చాయి. దీంతో కమల్ తన మనసు మార్చుకుని థియేటర్‌లలో విశ్వరూపం విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
శాటిలైట్ రైట్స్ వల్లేనా?
ఇదే సమయంలో ముస్లిం మనోభావాలు దెబ్బతినేలా విశ్వరూపంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ సినిమాపై 15 రోజులు నిషేధం విధించారు. అయితే విశ్వరూపం చిత్రాన్ని అడ్డుకోవడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఇప్పటికీ కోలీవుడ్‌లో కథలు కథలుగా చెప్పుకుంటారు. దీనికి ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ వివాదమే కారణమని అంటారు. తొలుత అధికార అన్నాడీఎంకేకు చెందిన ఓ ఛానెల్ .. విశ్వరూపం శాటిలైట్ హక్కులు కొనుగోలు చేయాలని భావించింది. దీనికి కమల్ అభ్యంతరం చెప్పడంతో అప్పటి అధికార పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసి విషయం ముఖ్యమంత్రి జయలలిత వరకు వెళ్లిందని తమిళ వర్గాలు చెబుతాయి.
వ్యూహాత్మకంగా జయలలిత
నిషేధంపై కమల్ హాసన్ హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోగా.. ఆ వెంటన్ అప్పీల్ పిటిషన్ వేసిన జయ సర్కార్ న్యాయస్థానంలో స్టే వచ్చేలా చేసింది. ముస్లింల మనోభావాలే తమకు ముఖ్యమని ఆ వర్గంలోకి జయలలిత సంకేతాలు పంపగలిగారు. తమిళనాడులోని 8 లోక్‌సభ స్థానాలు, 30 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్ధుల గెలుపోటములు శాసించే స్థితిలో ముస్లిం ఓటు బ్యాంక్ ఉంది. దీంతో వారిని ప్రసన్నం చేసుకోవడంతో పాటు కమల్ హాసన్‌కు హెచ్చరికలు పంపాలనే ఉద్దేశంతో జయలలిత వ్యూహాత్మకంగా వ్యవహరించారని విశ్లేషకులు చెబుతారు.
తమిళనాడులో ఉండలేనన్న కమల్ హాసన్
సొంత రాష్ట్రంలోనే తన సినిమాలకు అవరోధాలు ఎదురవుతుండటంతో కమల్ హాసన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ ఆయన పలుమార్లు కంటతడి పెట్టారు కూడా. కేంద్ర ప్రభుత్వం సైతం కమల్ హాసన్‌కు మద్ధతుగా నిలబడినప్పటికీ జయలలిత మాత్రం తన పంతం వీడలేదు. దీంతో తమిళనాడును, దేశాన్ని వదిలి విదేశాలకు వెళ్లిపోతానని కమల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకదశలో తమిళనాడును మినహాయించి దేశంలోని వివిధ రాష్ట్రాలలో సినిమాను విడుదల చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ప్రభుత్వంతో ఎట్టి పరిస్ధితుల్లోనూ చర్చలకు సిద్ధం లేనన్న కమల్ కూడా చివరికి మనసు మార్చుకోవాల్సి వచ్చింది. వివాదం ముదరకుండా తమిళ సినిమా పెద్దలు, అన్నాడీఎంకేలోని కొందరు నేతలు జయలలితను ఒప్పించడంతో ఆమె మెత్తబడ్డారు.
విశ్వరూపం వసూళ్ల వర్షం
ఆందోళన చేస్తున్న ముస్లిం సంఘాలను కూడా రాధిక శరత్ కుమార్, శివకుమార్ తదితరులు చర్చలకు ఒప్పించడంతో కమల్ దిగివచ్చారు. అన్ని అడ్డంకులను దాటుకుని 2013 జనవరి 25న తమిళ, తెలుగు భాషల్లో విశ్వరూపం సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.220 కోట్లకు వసూళ్లు సాధించి అత్యధిక వసూళ్లు రాబట్టిన తమిళ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అలా జయలలిత- కమల్ హాసన్‌ల మధ్య చోటు చేసుకున్న వివాదం సద్దుమణిగింది.


Click it and Unblock the Notifications











