కాజల్ వివాదం ముదురుతోంది
చెన్నై : కాజల్ అగర్వాల్‌పై తమిళ హీరో, కరుణానిధి మనవడు అయిన ఉదయనిధి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఇప్పుడిప్పుడే ముగిసేటట్లు లేదు. ఎందుకంటే కాజల్..తిరిగి తాను తీసుకున్న అడ్వాన్స్ ని చెల్లించటానికి ఇష్టపడటం లేదు. తన నలభై రోజుల డేట్స్ సైతం వృధా అయ్యాయని, అందుకోసం ఆ డబ్బులు మినహాయించుకున్నట్లు చెప్తోంది. తనకు చివరి నిముషంలో తనను వద్దనుకుని నయనతార తో ముందుకు వెళ్తున్నట్లు తెలియచేసారని అంటోంది. ఈ విషయమై ఆమె నటీనటుల సంఘం నడిగర సంఘం కు వెళ్తానంటోంది.
వివాద వివరాల్లోకి వెళితే...
నటి కాజల్ అగర్వాల్ నుంచి రూ.40 లక్షలు ఇప్పించాలని కోరుతూ నిర్మాతల సంఘంలో ఉదయనిధి ఫిర్యాదు చేశారు. అందులోని వివరాల ప్రకారం.... తమిళంలో ఉదయనిధి స్టాలిన్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న 'నన్బేన్డా'లో నటించేందుకు తొలుత కాజల్ అంగీకరించారు. అడ్వాన్స్‌గా రూ.40 లక్షలు తీసుకున్నారు. కొన్ని కారణాలతో ఆమె చిత్రం నుంచి తప్పుకున్నారు.

దీంతో ఉదయనిధికి జంటగా నయనతార నటించింది. ప్రస్తుతం ఈ చిత్రం తుది దశలో ఉంది. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని కాజల్‌ను ఉదయనిధి కోరారు. తరువాతి చిత్రం నిమిత్తం అందించే అడ్వాన్స్‌లో ఆ మొత్తాన్ని మినహాయించుకోమని ఆమె సమాధానం చెప్పారు. ఈ విషయమై నిర్మాతల సంఘంలో ఉదయనిధి ఫిర్యాదు చేశారు.
కాజల్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా గోవిందుడు అందరివాడే చిత్రం, ఎన్టీఆర్ సరసన నేనో రకం చిత్రంలో చేస్తోంది. బండ్ల గణేష్ ఈ రెండు చిత్రాలకు నిర్మాత కావటం విశేషం. ఆమె హిందీలోనూ సినిమాలు ఒప్పుకుంటోంది.
కాజల్ మాట్లాడుతూ... " పారితోషికం అనేది నాకెప్పుడూ సమస్య కాలేదు. నా పారితోషికంతో నిర్మాతలెవరూ ఇబ్బంది పడలేదు. అలా అయితే నేను తమిళంలో బిజీగా ఉండేదాన్ని కాదు కదా. తెలుగు సినిమాలంటే నాకు చాలా ఇష్టం'' అని చెప్పింది కాజల్ అగర్వాల్.


Click it and Unblock the Notifications











