‘అమర్ హై' అంటున్న కమల్
విలక్షణ నటుడు కమల్ హాసన్ 'ఈనాడు' చిత్రం తర్వాత చేయబోయే కొత్త ప్రాజెక్ట్ ఫైనలైజ్ అయింది. ఈ చిత్రాన్ని ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారు. దీనికి 'అమర్ హై' అనే టైటిల్ కూడా కమల్ రిజిస్టర్ చేయించారు. కమల్ తాజా చిత్రమైన 'ఈనాడు' ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో 'ఉన్నైపోల్ ఒరువన్'గా ఇదేరోజు ఈ చిత్రం విడుదలవుతోంది. రాజ్ కమల్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి చక్రి తోలేటి దర్శకత్వం వహించారు. హిందీలో విజయవంతమైన 'ఎ వెన్స్ డే'కి రీమేక్ గా ఈ చిత్రం ఉండబోతోంది.
కమల్ తన ఫ్యూచర్ ఫ్యాజెక్ట్ ల గురించి మాట్లాడుతూ 'కొత్త సినిమా కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. అమర్ హై అనే ఓ టైటిల్ ను కూడా ఇందుకోసం రిజిస్టర్ చేయించాను. దీనిని హిందీలో చేయాలని అనుకుంటున్నాను. భూసంస్కరణల నేపథ్యంలో కథాంశం ఉంటుంది. ఇంతకు మించి ప్రస్తుతం పెద్దగా చెప్పడం సాధ్యపడదు' అన్నారు. కమల్ అంతకు ముందు చెప్పిన సమాచారం ప్రకారం ఆయన దర్శకత్వం వహించే తదుపరి చిత్రంలో కమల్ గురువు, ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ కీలక పాత్ర పోషించబోతున్నారు. అది 'అమర్ హై' కావచ్చు. అలాగే మిస్కిన్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ ఫిల్మ్ చేయబోతున్న విషయాన్ని కూడా కమల్ ధ్రువీకరించారు. ఇది కమల్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ 'మర్మయోగి' కావచ్చనే అభిప్రాయాలు కూడా పరిశ్రమలో వ్యక్తమవుతున్నాయి. అయితే స్వీయదర్శకత్వంలో కమల్ నటించే చిత్రమే ఆయన తదుపరి చిత్రం కాబోతోంది. ఆసక్తికరంగా ఏదో ఒకరోజు తన కుమార్తె శ్రుతి హాసన్ ను కూడా డైరెక్ట్ చేయాలనే ఆలోచన ఉన్నట్టు కమల్ వెల్లడించారు. అయితే దీనికి మరికొంత వ్యవధి పట్టే అవకాశాలున్నాయి.


Click it and Unblock the Notifications











