రజనీతో మూవీ: అలాంటి ఆశలు పెట్టుకోవద్దంటున్న కమల్ హాసన్
తమిళనాట టాప్ యాక్టర్స్ అయిన కమల్ హసన్, రజనీకాంత్ సొంతగా రాజకీయ పార్టీలు స్థాపించి ప్రజలకు ఏదైనా మంచి చేద్దామనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నారు. వీరు స్థాపించిన పార్టీల వల్ల తమిళనాట రాజకీయ సమీకరణాలు మారుతాయని భావిస్తున్నారు.
ఆ సంగతి పక్కన పెడితే... రాజకీయాల్లోకి ప్రవేశించిన ఈ ఇద్దరు స్టార్స్ రాను రాను సినిమాలు చేయడం తగ్గించేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ మాట్లాడుతూ రెండింటిని కొనసాగించడం సాధ్యంకాదని, అందుకే సినిమాలు తగ్గించేస్తున్నట్లు తెలిపారు.

సినిమాలు చేస్తే పూర్తి సమయం దానికే కేటాయించాల్సి ఉంటుంది. అందుకే క్రమక్రమంగా సినిమాలు తగ్గిస్తున్నట్లు తెలిపారు. అయితే బిగ్ బాస్ తమిళ రియాల్టీ షో మాత్రం కొనసాగిస్తాను అంటున్నారు కమల్. దీని కోసం వారానికి ఒక రోజు కేటాయిస్తే చాలు. ఇది తన రాజకీయ ప్రయాణానికి ఏ మాత్రం ఇబ్బంది కాదన్నారు.
త్వరలోనే విడుదల కాబోతున్న విశ్వరూపం 2 సినిమా గురించి చెబుతూ... సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ఆగస్టులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కమల్ తెలిపారు. ఈ సినిమా పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు.
రజనీతో సినిమా చేసే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు కమల్ హాసన్ స్పందిస్తూ.... ఇప్పుడు జరిగేపని కాదని తెలిపారు. ఇద్దరం రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కలిసి నటించడమనేది జరగకపోవచ్చు' అని తెలిపారు.


Click it and Unblock the Notifications