వెనక్కి తగ్గిన కమల్ హాసన్...కూల్ అయిన జయ
చెన్నై : విశ్వరూపం చిత్రంపై నెలకొన్న వివాదం సద్దుమనిగే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. చిత్ర నిర్మాత, దర్శకుడు కమల్ హాసన్ గొడవను మరింత పెద్దది చేసుకుని నష్టం పోడవం ఇష్టం లేక రాజీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు సినిమాలో అభ్యంతరకరంగా ఉన్న దృశ్యాలను తొలగించేందుకు సిద్ధం అయ్యారు. ఈ రోజు ఆయన ముస్లిం పెద్దలతో చర్చలు జరుపనున్నారు.
మరో వైపు తమిళ సినీ పరిశ్రమ కూడా కమల్ హాసన్‌కు చేదోడు వాదోడుగా నిలిచింది. సినిమా విడుదలయ్యే దిశగా అటు ముస్లిం సంఘాలతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో మధ్య వర్తిత్వం జరుపుతున్నారు. తమిళ పరిశ్రమ తరుపున రాధిక, శరత్ కుమార్, శివకుమార్ తదితర ప్రముఖులు అదే పనిగా సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నారు.
విశ్వరూపం విడుదల వెనక రాజకీయ కుట్ర ఉందని ఇటీవల చెన్నైలో వ్యాఖ్యానించిన కమల్ హాసన్ ఆ తర్వాతి పరిణామాలతో కాస్త తగ్గారు. పట్టుదలకు పోయి నష్టపోవడం కంటే రాజీకుదుర్చుకుని కొన్ని సీన్లు తీసి వేయడమే మంచిందనే భావనకు వచ్చారు. ఈ మేరకు సినిమాలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సీన్లను తీసేయడానికి తాను సుముఖమే అనే సంకేతాలు ఇచ్చారు.
రెండు రోజుల్లో విశ్వరూపం వివాదానికి సంబంధించిన సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో సినిమా నిలిపి వేయడం వలన ఇప్పటికే కమల్ హాసన్ కు కోట్లలో నష్టం వాటిల్లింది. తమిళనాడు మినహా ఇతర ప్రాంతాల్లో ఈ సినిమా విడుదలైనప్పటికీ మెయిన్ రాబడి వచ్చే తమిళనాడు నుండే కాబట్టి కమల్ తీవ్రంగా నష్టపోయారు.
విశ్వరూపం వివాదం వెనక తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హస్తం ఉందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే మీడియా ప్రచారాన్ని జయలలిత గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖండించారు. కమల్ తనకు శత్రువు కాదని, ప్రత్యర్థి కాదని, అతనితో తనకు ఎలాంటి విబేధాలు లేవని చెప్పిన జయ... శాంతి భద్రతలు కాపాడటంలో భాగంగానే విశ్వరూపం చిత్రాన్ని నిలిపివేసినట్లు తెలిపారు. విశ్వరూపం చిత్రంపై నిషేదం విధించలేదన్నారు. కమల్ రాజీకి ఒప్పుకోవడంతో ముఖ్యమంత్రి జయలలిత కూడా కూల్ అయినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











