ఫ్యాన్స్ కు కమల్ హాసన్ సూచన
చెన్నై : అభిమానుల ఆగ్రహం తీవ్రరూపం దాల్చుతుండడంతో కమల్ స్వయంగా రంగంలో దిగి అభిమానులకు సందేశాన్నిచ్చారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఆయన అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ, ముస్లిం సోదరులతో చర్చలు జరిపి పరస్పర అంగీకారానికి ప్రయత్నిస్తున్నామని, అభిమానులు ఆవేశపడకుండా ప్రశాంతంగా వుండాలని సూచించారు. న్యాయస్థానం తీర్పును గౌరవించాల్సిందేనని, అభిమానుల తరపున తానే పోరాడుతానన్నారు.
కమల్ మాటల్లోనే.... 'ఇది సినిమా. నేనొక చిన్న కళాకారుడిని. ఉదయం నేను మాట్లాడింది కోపంతో కాదు, బాధతో. ఆ మాటల కోసం మీరు పోరాటాలకు దిగవద్దు. ఇది సమాజ సేవకు సమయం. ప్రజాపోరాటాలకు కాదు. అభిమానులు కోపగించుకోకుండా ప్రశాంతంగా వుండాలని కోరుతున్నా. కోర్టు తీర్పు వచ్చే వరకు ఎదురుచూద్దాం' అని కమల్ అభిమానుల్ని కోరారు.
దేశం వదిలివెళ్లిపోతానన్న కమల్ వ్యాఖ్యలు అభిమానులపై బాగా ప్రభావం చూపాయి. కమల్ వెళ్లిపోతే, తాము కూడా ఆయనవెంటే వెళ్లిపోతామని ఆవేశంగా మాట్లాడారు. ఈ విషయంలో ప్రభుత్వతీరును నిరసిస్తూ రేషన్‌కార్డులను తిరిగిచ్చేస్తామని హెచ్చరించారు. 'విశ్వరూపం'లో మాదిరే తమిళనాడులో ఆ చిత్ర విడుదల వ్యవహారం కూడా మలుపులు తిరుగుతోంది. విడుదలకు మద్రాస్ హైకోర్టు నుంచి అనుమతి వచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే ఆ చిత్ర దర్శకుడు, నిర్మాత, హీరో కమల్‌హాసన్‌కు మళ్లీ నిరాశ ఎదురైంది.
తమిళనాడులో విశ్వరూపం విడుదలను నిలుపుదల చేస్తూ హైకోర్టు తాజాగా బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ముస్లింల మనోభావాలు దెబ్బ తినకుండా సినిమాలో మార్పులు చేస్తామని అంగీకరించినా మళ్లీ అడ్డంకులు ఎదురైన నేపథ్యంలో నిరాశకు గురైన కమల్ తమిళనాడును విడిచి వెళ్తానని ఆవేదన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











