వెంకటేష్ కు సలహా ఇచ్చాడు
చెన్నై: నువ్వు ఫలానా సినిమా రీమేక్ చేయి..బాగుంటుంది అని ఒక హీరోకు , మరో హీరో సలహా ఇస్తారా...అంటే వారి బంధాన్ని బట్టి ఉంటుంది. వెడ్నస్ డే చిత్రం రీమేక్ ఈనాడులో తనతో కలిసి నటించిన వెంకటేష్ కు కమల్ ఈ మద్యన అలాంటి సలహానే ఇచ్చారట. దృశ్యం చిత్రం బాగుంది...నేను రీమేక్ చేస్తున్నాను..నువ్వు కూడా చేయి అని. కమల్ లాంటి గొప్ప నటుడు ఇచ్చిన సలహాతో చేసిన చేస్తున్న చిత్రం కాబట్టి మసాలా చిత్రంలాగ బోల్తా కొట్టకపోవచ్చు అనే ధీమా కూడా ఉండే ఉంటుంది.
'విశ్వనటుడు' కమల్‌హాసన్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. 'విశ్వరూపం-2', 'ఉత్తమ విలన్' సినిమాల రూపకల్పనలో ఉన్న కమల్.. తాజాగా మలయాళ 'దృశ్యం' చిత్రంపై కూడా దృష్టి పెట్టారు. మలయాళంలో భారీ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ప్రస్తుతం తెలుగులో అదే పేరిట తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వెంకటేశ్, మీనా కలసి నటిస్తున్నారు.
ఆసక్తికరంగా సాగే ఈ చిత్రకథపై పలు భాషా చిత్ర పరిశ్రమలు ఆసక్తి కనబరుస్తున్నాయి. తమిళంలో కమల్ నటిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా తెలుగులో వెంకటేశ్‌ను సిఫార్సు చేసింది కూడా కమలేనని కోలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా మీనా పాత్రలో కమల్ సరసన గౌతమి నటించనున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెలలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు కోడంబాక్కం సమాచారం.

కనిపించేదంతా నిజం కాదు అనే ట్యాగ్ లైన్ తో వెంకటేష్ తాజా చిత్రం 'దృశ్యం' ఫస్ట్ లుక్ వచ్చేసింది. వెంకటేష్ మరో రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన 'దృశ్యమ్' సినిమాని తెలుగులో వెంకటేష్ చేస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీప్రియ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్ సరసన మీనా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల చేయటానికి నిర్ణయించారు. మేజర్ పార్ట్ ని వైజాగ్ రూరల్ ఏరియాలో పూర్తి చేయనున్నారు.
నిర్మాత మాట్లాడుతూ...''గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు.. వాటి వల్ల ఆయా కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందుల్ని కళ్లకు కట్టేలా దర్శకురాలు తీర్చిదిద్దుతున్నారు. అనేక సమకాలీన అంశాల్ని చిత్రంలో పొందుపరుస్తున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధాన్ని చూపే సన్నివేశాల్ని దర్శకురాలు చక్కగా తెరకెక్కిస్తున్నారు'' అంటున్నారు.
మీనా హీరోయిన్ గా చేసే ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ థియేటర్స్, సురేష్ ప్రొడక్షన్స్, వైడ్ యాంగిల్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాజ్‌కుమార్ సేతుపతి నిర్మాత. డి.సురేష్‌బాబు సమర్పకులు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం వైజాగ్ లోని అందమైన లొకేషన్స్‌లో జరుగుతోంది. చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో నదియా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
వెంకటేష్ మాట్లాడుతూ.... ఇక్కడ ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకోలేం. ఎంతసేపూ సురక్షితంగానే ప్రయాణం చేయాలి. ఆ పంథాలో ఆలోచించినప్పుడే రీమేక్ సినిమాలు తెరకెక్కుతుంటాయి. అయినా రీమేక్ చేయడం తప్పేం కాదు. మంచి సినిమా అనుకొన్నప్పుడు... దాన్ని మన ప్రేక్షకులకు కూడా అందేలా చేయాలి. అలా చేసిన ప్రతీసారీ నాకు విజయం దక్కింది.
నేనే కాదు... హీరోల్లో చాలామంది రీమేక్ సినిమాలు చేశారు. కాకపోతే వాటిలో నాకు ఎక్కువ విజయాలున్నాయి. ఇటీవల పొరుగు భాషల్లోని హీరోలు సైతం రీమేక్ సినిమాలపై దృష్టి కేంద్రీకరించారు. హిందీలో సల్మాన్‌ఖాన్ మన తెలుగు కథలతో విజయాలు అందుకొంటున్నాడు. కథలు వినిపించడానికి చాలామంది వస్తుంటారు. అయితే... ఆ కథలు ప్రేక్షకులకి ఎలా చేరతాయనే విషయం గురించి ఆలోచించాలి. అప్పుడే సరైన ఫలితాలొస్తాయి అన్నారు.


Click it and Unblock the Notifications











