కార్తి 'శకుని' విడుదల తేదీ ఖరారు
తమిళ హీరో కార్తీ హీరోగా చేస్తున్న చేస్తున్న చిత్రం 'శకుని'. ప్రణీత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి బెల్లంకొండ సురేష్ నిర్మాత. ఈ చిత్రాన్ని జూలై అరున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. శంకర్‌దయాళ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకొంది. త్వరలో పాటల్ని విడుదల చేస్తారు. విభిన్న గెటప్ లతో కార్తీ ఈ చిత్రంలో వెరైటీగా కనిపించనున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే మంచి క్రేజ్..తమిళ,తెలుగు భాషల్లో నెలకొని ఉంది.
ఇక 'శకుని'చిత్రం స్టోరీ లైన్ విషయానికి వస్తే...'శకుని అంటే దుష్ట ఆలోచనలే అనుకోవద్దు. ఓ సమస్య నుంచి తెలివిగా ఎలా బయటపడాలో అతనికి బాగా తెలుసు. ప్రజాస్వామ్యంలో శకుని స్వభావం ఉన్నవాళ్లు చాలామంది కనిపిస్తుంటారు. ప్రస్తుతం మధ్యవర్తులు లేకపోతే... ఏ పనీ జరగడం లేదు. లంచం ఇవ్వకపోతే ఫైలు కదలడం లేదు. ఈ వాతావరణంలో ఓ యువకుడు శకునిలా తన పనులను చక్కబెట్టుకొన్నాడు అనేదే ఈ కథ అని చెప్పుతున్నారు.
దర్శకుడు శంకర్ దయాళ్ మాట్లాడుతూ, 'బాల్యదశలో ఉన్న ఓ పిల్లవాడు యవ్వనం వరకు సాగే ప్రయాణం ఎలా ఉంటుందో ఈ చిత్రంలోని కథానాయకుడు రాజకీయాల్లోకి ప్రవేశించే క్రమం ఆ విధంగా ఉంటుంది. రాజకీయంగా అతనిని కలిసే ప్రతివ్యక్తి మలుపుకి కారణమవుతాడు. ఎదుటివాళ్ళు కష్టంలో ఉంటే ఆదుకునే మనస్తత్వం ఈ చిత్రంలోని హీరోది' అని చెప్పారు.అదెలాగో మా సినిమా చూస్తే తెలుస్తుంది అంటున్నారు దర్శకుడు శంకర్‌దయాళ్.
ఈ చిత్రంలో వైయస్ జగన్ పై సెటైర్స్ ఉండబోతున్నాయని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. 'యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ' చిత్రాలను తీసిన స్టూడియో గ్రీన్ సంస్థ తాజాగా కార్తితోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆ చిత్రాల కోవలోనే ఈ చిత్రాన్ని కూడా తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నామని, రెండు భాషల్లోనూ ఒకేసారి విడుదల చేస్తామని నిర్మాత జ్ఞానవేల్‌రాజా తెలిపారు. కార్తి మాట్లాడుతూ, 'ఈ చిత్రంలో చాలా గెటప్స్‌లో కనిపిస్తాను. అనేక మలుపులతో చిత్రం ఆసక్తిని కలిగిస్తుంది. మంచి ప్రతిభాపాటవాలు ఉన్న వ్యక్తి దర్శకుడు. చిత్రాన్ని అతనెంతో బాగా తీర్చిదిద్దారు. టైటిల్ మొదలుకుని అన్ని అంశాలు ఆసక్తిని కలిగిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి' అని అన్నారు.
ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు, రాధిక, నాజర్, రోజా, సంతానం తదితరులు తారాగణం. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: సాహితి, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్, ఛాయాగ్రహణం: పి.జి.ముత్తయ్య, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఆర్ట్: రాజీవన్, ఫైట్స్: అనల్ అరసు, డాన్స్: ప్రేమ్‌రక్షిత్, బాబా భాస్కర్, సహ నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాష్, ఎస్.ఆర్.ప్రభు, నిర్మాత: కె.ఇ.జ్ఞానవేల్‌రాజా, దర్శకత్వం: ఎన్.శంకర్ దయాళ్.


Click it and Unblock the Notifications











