twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాడుకుని వదిలేసారని భాధపడుతోంది

    By Srikanya
    |

    చెన్నై: 'నేను ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతోనే పార్టీలో చేరా. ఆ పార్టీకి శాయశక్తులా కృషి చేశా. నాకు అప్పగించిన అన్ని పనులనూ వందశాతానికన్నా ఎక్కువగానే చేశా. కానీ పార్టీ నన్ను మరిచిపోయింది. పార్టీకోసం ఇంత శ్రమించినా.. ఆ సేవలన్నీ 'వన్‌వే'గా మారిపోయాయి. దీనివల్ల మనోవేదన, ఒత్తిడి తప్ప నాకు ఒరిగిందేమీ'లేదంటూ ఆవేదన వ్యక్తంచేసింది. అందువల్లే పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నానంటూ ప్రస్తావించింది ఖుష్బూ. తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఖుష్బూ గురించే అంతటా చర్చలు. ఆమె డిఎంకే నుంచి బయిటకు రావటమే అక్కడ మీడియాలో సంచలనమైన వార్త.

    సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన 'ధర్మత్తిన్‌ తలైవన్‌' చిత్రంతో కోలీవుడ్‌ను చూసిన కుష్బూ.. ఒక్క చిత్రంతోనే మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఎక్కడో ముంబయిలో పుట్టి పెరిగినా.. తమిళుల హృదయంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటి కుష్బూ. అభిమానులతో ఆలయాన్ని కట్టించుకున్న ఈ సుందరాంగి వెండితెర కెరీర్‌ వెనకబడటంతో .. బుల్లితెరపైకి వచ్చింది. అక్కడ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అనంతరం 'అమ్మ'కటాక్షాన్ని సైతం వదులుకుని కరుణసేనలో సైనికురాలిగా మారింది. ఎప్పటికైనా 'మంత్రి' కాకపోతామా?.. అన్న ధీమా నానాటికీ సన్నగిల్లడంతో 'ఈ వన్‌వే దారి నాకొద్దు'అంటూ పార్టీకి సెలవు చెప్పింది. మరికొద్దిరోజుల్లో 'కమల' తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉందని రాజకీయవర్గాలు కోడై కూస్తున్నాయి.

    Khushboo says her ties were one-way

    తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కుష్బూ అందచందాలు, అభినయం ఉండటంతో.. తక్కువ సమయంలోనే ఫాలోయింగ్‌ పెరిగింది. ఆ తర్వాత కమల్‌, సత్యరాజ్‌, ప్రభు వంటి అగ్ర హీరోలతోనూ అమ్మడు ఆడిపాడింది. 'చిన్నతంబి' చిత్రంలో ఊహించని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది కుష్బూ. ఇందులో ప్రభు, కుష్బూ జోడీ అందరకీ నచ్చడంతో.. ఈ జంట మరిన్ని చిత్రాల్లో కనువిందు చేసింది. కథానాయిక పాత్రలు తగ్గాక.. ఇతర పాత్రల్లో కూడా నటించింది. కన్నడ, మలయాళం, తెలుగులోనూ వందలాది చిత్రాల్లో నటించింది.

    ఆమెకు వెండితెరలో అవకాశాలు తగ్గినా.. వెంటనే బుల్లితెర అండగా నిలిచింది. తమిళంలోని ఓ ప్రైవేటు ఛానల్‌లో ఆమె నటించిన 'జనని', 'కుంగుమం' ధారావాహికలు ఆమెకు మరింత ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. స్వీయ నిర్మాణంలో పలు ధారావాహికలను కూడా నిర్మించింది. ప్రస్తుతం 'కలైంజ్ఞర్‌' ఛానల్‌లో 'పార్త న్యాబగం ఇల్లయో' దాదాపు రెండొందల రోజులు దాటి ప్రసారమవుతోంది. ఇదిలా ఉండగా కుష్బూకు అత్యంత క్రేజీని తెచ్చిపెట్టిన కార్యక్రమం 'జాక్‌పాట్‌'. 'జయ'టీవీలోని ఈ కార్యక్రమం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకర్షించింది.

    కుష్బూ యాంకర్‌గా 'జాక్‌పాట్‌' ప్రసారమవుతున్న తరుణంలో.. అప్పట్లో ప్రతిపక్షంలో జయలలిత కటాక్షం కూడా ఆమెపై ఉండేది. కానీ పాలకపక్షంలో కీలకపాత్ర పోషించాలన్న ఆలోచన కుష్బూలో పెరగడంతో 'అమ్మ' మద్దతును పక్కనబెట్టి.. డీఎంకేలో చేరింది. పార్టీ కార్యక్రమాలన్నింటిలోనూ పాలుపంచుకుని తనదైన ముద్రకోసం కృషి చేసింది. ఆందోళనలు అయినా, సన్మానసభలైనా, ఏ ఇతర వేదికలైనా.. తాను కూడా ముఖ్య భాగస్వామిగా వ్యవహరించింది. కొన్ని కార్యక్రమాలకు వ్యాఖ్యాతగానూ వ్యవహరించింది. మరోవైపు గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ డీఎంకేకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసొచ్చింది.

    కుష్బూ త్వరలో భాజపాలో చేరనున్నట్లు రాష్ట్ర రాజకీయవర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఇటీవల భాజపా మహిళానేత, కేంద్రమంత్రి స్మృతీ ఇరానీపై విమర్శలు వెల్లువెత్తినా.. 'చదువు ముఖ్యం కాదు.. ప్రతిభే కొలమానంగా తీసుకోవాల'అంటూ మద్దతు స్వరాన్ని వినిపించింది కుష్బూ. మరోవైపు భాజపా రాష్ట్ర నేత వాసంతి శ్రీనివాసన్‌ కూడా కుష్బూ భాజపాలోకి వచ్చే అంశంపై స్పందించారు. ఆమె వస్తే తమ పార్టీ సాదరంగా ఆహ్వానిస్తుందని పిలుపునిచ్చారు. మరి కుష్బూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే. మరోవైపు ప్రస్తుతం తన ఆశలన్నీ బుల్లితెరపై ఎక్కువగా పెంచుకుంది కుష్బూ.

    గతంలోనూ డీఎంకేలో ఇలాంటి ఆపసోపాలే ఎదుర్కొన్నారు సినీ ప్రముఖులు. శరత్‌కుమార్‌ కూడా డీఎంకేలో విశేష సేవలందించి గుర్తింపు సాధించాలని ప్రయత్నించారు. అయితే.. ఆశించిన ఫలితం దక్కకపోవడంతో అన్నాడీఎంకే చేరి, ఆనక సమత్తువమక్కల్‌ కట్చి అంటూ కొత్త పార్టీ స్థాపించారు. ఇక టి.రాజేందర్‌ కూడా ఒకప్పుడు డీఎంకేకు ప్రచార కార్యదర్శిగా వ్యవహరించారు. కానీ పరిస్థితి బెడిసి కొట్టడంతో.. 'లక్ష్య డీఎంకే' అనే పార్టీని పెట్టారు. దర్శకనటుడు భాగ్యరాజ్‌ కూడా డీఎంకేలో ఎక్కువకాలం కొనసాగలేకపోయారు. అంతెందుకు.. 'మక్కల్‌ తిలగం' ఎంజీఆర్‌ కూడా ఒకప్పుడు డీఎంకే నేతే. అక్కడ ఇమడలేకే.. అన్నాడీఎంకేను స్థాపించారు.

    English summary
    
 
 Khushboo, who has been sidelined within the party for quite some time, wrote, "My hard work and dedication towards the party is one way. It has not been recognised and returned."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X