రజనీకాంత్ సినిమా కూడా సంక్రాంతికే...!
చెన్నై: రోబో తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రజనీకాంత్ త్వరలో 'కొచ్చాడయాన్' అనే భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో విక్రమ సింహా పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.
తాజాగా చెన్నయ్ నుంచి అందిన రిపోర్ట్స్ ప్రకారం డిసెంబర్ 12 నాటికి సినిమా విడుదల సాధ్యం కావడం లేదని, అందువల్ల ఈచిత్రాన్ని సంక్రాంతికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయినప్పటికీ సినిమాలో భారీ ఎత్తున గ్రాఫిక్స్ ఉన్నందున అవి పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతోందని అంటున్నారు.
ఈ చిత్రంలో రజనీకాంత్..రణధీరన్ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ కెమెరా వర్క్ అందించనున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది.
దర్శకుడు కె.ఎస్. రవికుమార్ పర్యవేక్షణలో రజనీ చిన్న కుమార్తె సౌందర్య డైరెక్ట్ చేస్తుండగా... ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. రోబో తర్వాత రజనీ 'రాణా' చిత్రాన్ని మొదలు పెట్టారు. ఆ చిత్రం ప్రారంభోత్సవం రోజు ఆయన అనారోగ్యానికి గురి కావడం సినిమా అటకెక్కింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత రజనీ మళ్లీ తన కూతురు సౌందర్య దర్శకత్వంలో 'కొచ్చాడయాన్' సినిమా చేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా హాలీవుడ్ మూవీ అవతార్ తరహాలో మోషన్ కాప్చర్ టెక్నాలజీతో 3డి ఫార్మాట్‌లో.... ఇండియాలో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











