నా పనిలో వేలు పెట్టి .. ఆ సినిమా ఫ్లాప్ అందుకే, సూపర్‌స్టార్‌పై స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
దర్శకుల పని, సినిమా వ్యవహారాల్లో హీరోల జోక్యం పెరిగిపోతోందని కొందరు బాహాటంగానే విమర్శించిన ఘటనలు ఉన్నాయి. ఇంకొందరైతే తమ సినిమాలలో స్పూఫ్‌లు పెట్టి తమ బాధను వెళ్లగక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం తన పనిని తాను చేయనిస్తే సినిమా రిజల్ట్ ఓ రేంజ్‌లో ఉండేదంటూ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ వ్యాఖ్యానించడం పెద్ద దుమారం రేపింది. తాజాగా ఈ లిస్ట్‌లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ చేరారు. ఈ వివరాల్లోకి వెళితే..
మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ వంటి వరుస బ్లాక్ బస్టర్స్‌తో జోరు మీదున్న కొరటాల శివకు ఆచార్య సినిమా బ్రేకులు వేసింది. మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు హీరోలుగా నటించిన ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. మెగా కాంపౌండ్ మితిమీరిన జోక్యం వల్లనే ఆచార్య ఫ్లాప్ అయ్యిందని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అయితే కొరటాల టేకింగ్‌లో లోపాల వల్లే సినిమా ఆడలేదనే వారు కూడా లేకపోలేదు.

ఇటీవల ఓ కార్యక్రమంలో కొరటాల మాట్లాడుతూ.. మన పని మనల్ని చేసుకోనిస్తే రిజల్ట్ వేరేలా ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఆయన పరోక్షంగా చిరంజీవిని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేశాడని మెగా ఫ్యాన్స్ మండిపడ్డారు. ఇది జరిగిన కొద్దిరోజులకు ఎన్టీఆర్ మాట్లాడుతూ.. కొరటాలకు సరైన ప్లేస్, సరైన మనషులు ఉంటే చాలు అద్భుతమైన సినిమాలు అందిస్తాడని వ్యాఖ్యానించారు. ఇది ఆచార్య గురించేనంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు.
ఆ తర్వాత దేవర సక్సెస్ మీట్‌లో గీత రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఎవరి పనిని వారు చేసుకోనిస్తే విజయం ఇలా ఉంటుందని.. దర్శకుడిని హీరో నమ్మితే అది మరింతగా ఉంటుందని దేవర రుజువు చేసిందని వ్యాఖ్యానించారు. అయితే తన వ్యాఖ్యలను విపరీతార్ధాలు తీయొద్దని.. కేవలం కొరటాలను ప్రశంసించడానికే తాను అలా అన్నానని శాస్త్రి తెలిపారు.

తాజాగా తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ .. సినిమా వ్యవహారాలలో హీరోల జోక్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఏకంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ గురించి. రజనీ- రవికుమార్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ముత్తు, నరసింహా సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ తర్వాత వీరి కలయికలో వచ్చిన మూవీ లింగ. సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చిన ఫ్లాప్ అయ్యింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రవికుమార్ మాట్లాడుతూ.. లింగ ఎడిటింగ్‌లో రజనీ జోక్యం చేసుకున్నారని , ఇంటర్వెల్ తర్వాత మొత్తం మార్చేశారని ఆరోపించారు. సీజీ వర్క్ కోసం తనకు ఏమాత్రం టైమ్ ఇవ్వకపోగా.. ఓ బెలూన్ సీన్‌ని పెట్టారని, క్లైమాక్స్‌లో ట్విస్ట్‌ను కూడా తీసేశారని రవికుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా తలైవా అభిమానులు ట్రోలింగ్‌కు దిగుతున్నారు.


Click it and Unblock the Notifications











