Mayilsamy: సినీ పరిశ్రమలో మరో విషాదం.. గుండెపోటుతో పాపులర్ కమెడియన్ కన్నుమూత!
ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, కే విశ్వనాథ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. లెజండరీ దర్శకులు కే విశ్వనాథ్, దిగ్గజ గాయనీ వాణి జయరాం మరణించగా.. తాజాగా శనివారం నందమూరి తారకరత్న కన్నుమూయడం సినీ లోకాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. ఆయన మరణ వార్తతో శోకసంద్రంలో ఉండగానే మరోక నటుడు కన్నుమూయడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించినట్లు అయింది. తాజాగా ఆదివారం మరొక నటుడు, కమెడియన్ మైల్ స్వామి అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచారు.
చిత్ర పరిశ్రమలో వెనువెంటనే వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న ఫిబ్రవరి 18న సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ఇంకా పూర్తి కాలేదు, ఆయన మరణ వార్తను ఇంకా దిగమింగుకోకముందే మరొక నటుడు మరణించడం విషాదకరమైన విషయం. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కమెడియన్, హాస్య నటుడు మైల్ స్వామి అనారోగ్య కారణాలతో మరణించారు. ఆయన వయసు 57 సంవత్సరాలు కాగా.. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం తెల్లవారు జామున ఒంట్లో కాస్తా నీరసంగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పగా.. వారు పోరూర్ లోని ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో మైల్ స్వామిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందినట్లు తెలిపారు. అయితే ఆయన గుండెపోటుతో మరణించినట్లు పలు ఇంగ్లీష్ వెబ్ సైట్స్ ప్రచురించాయి. దీంతో ఒక్కసారిగా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన మైల్ స్వామి 1984లో నటుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ మొదట్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు చాలా కష్టపడాల్సి రాగా.. తర్వాత నెమ్మదిగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. 2000 సంవత్సరం నుంచి కమెడియిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో తనదైన నటన, కామెడీతో ఆకట్టుకున్నారు. ఆయన తమిళంతోపాటు పలు తెలుగు సినిమాల్లోనూ నటించగా.. అందులో కొన్నింట్లో విలన్ పాత్రలు సైతం పోషించారు.

మైల్ స్వామి మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమలోని సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా మైల్ స్వామి మరణంపై ట్వీట్ చేసి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అలాగే మైల్ స్వామి ఇంటికి వెళ్లి ఆయన పార్థీవదేహానికి పూల మాలలు వేసి కమల్ హాసన్, విక్రమ్ సహా పలువురు హీరోలు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాధికా శరత్ కుమార్, మనో బాల తదితరులు సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా సంతాపం తెలియజేశారు.


Click it and Unblock the Notifications











