రాజకీయం: ఆమరణ దీక్షతో... రజనీకాంత్ దిగొస్తాడా?
హైదరాబాద్: రజనీకాంత్ నటించిన ‘లింగా' చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగల్చడం, రజనీకాంత్ జోక్యం చేసుకుని తమ డబ్బు తిరిగి ఇప్పించాలని గత కొంత కాలంగా డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్ని ఆందోళనలు చేసినా ఇటు నిర్మాత నుండి, అటు రజనీకాంత్ నుండి ఎలాంటి స్పందన లేక పోవడంతో డిస్ట్రిబ్యూటర్లు ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు.
ఈ నెల 27 నుండి ఆమరణ దీక్షకు అనుమతి ఇవ్వాలని ఆందోళన కారులు చెన్నై పోలీస్ కమీషనర్‌ను కోరారు. ఇటీవల ఆందోళన కారులు ఒక రోజు నిరాహార దీక్ష చేసి తమ నిరసన తెలిపారు. నిర్మాత రాక్ లైన్ వెంకటేస్ కర్నాటకకు చెందిన వాడు కావడంతో డిస్ట్రిబ్యూటర్లంతా రజనీకాంత్ జోక్యం చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు.

అయితే అభిమానుల వాదన మరోలా ఉంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే సంకేతాల నేపథ్యంలో...ఆయన పాలిటిక్స్ లోకి రాకుండా కుట్ర చేస్తున్నారని, ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. నష్టపోయిన వారు ఏ విషయం అనేది నిర్మాతతో తేల్చుకోవాలి. రజనీకాంత్‌ను బదనాం చేయడం దేనికని ప్రశ్నిస్తున్నారు.
‘లింగా' డిస్ట్రిబ్యూటర్ల నిరాహార దీక్షల వెనక రాజకీయ కోణం ఉందనడానికి ‘నాన్ తమిళర్ కట్చి' పార్టీ నాయకుడు సీమాన్ కూడా పాల్గొనడమే అంటున్నారు ఫ్యాన్స్ . ‘తమిళుడే ఈ గడ్డను ఏలాలి. రజనీకాంత్ తమిళుడు కాదు. అతన్ని నాయకుడిగా మేము ఒప్పుకోం. ఆయ రాజకీయాల్లోకి వస్తే తొలి ప్రత్యర్థి తానే' అంటూ గతంలో సీమాన్ వ్యాఖ్యలు చేసారు.
మరోవైపు తమిళ నటుల సంఘమైన నడిగర సంఘం కూడా రజనీకాంత్‌కు మద్దతుగా నిలిచింది. ‘లింగా' నష్టాల విషయంలో రజనీకాంత్ ను బాధ్యుడిని చేయడం తగదని తమిళ నటుల సంఘమైన ‘నడిగర సంఘం' స్పష్టం చేసింది. ఏమైనా ఉంటే నిర్మాతతో తేల్చుకోవాలి. రజనీకాంత్ ను బ్లేమ్ చేయడం తగదని పేర్కొన్నారు.
మొత్తానికి ‘లింగా' డిస్ట్రిబ్యూటర్ల వివాదం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఈ చిత్రాన్ని రాక్ లైన్ వెంకటేష్ నిర్మించారు. ఆయన ఈ చిత్రాన్ని ఈ రోస్ ఇంటర్నేషనల్ సంస్థకు అమ్మారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నుండి స్థానిక డిస్ట్రిబ్యూటర్లు భారీ ధరకు కొనుగోలు చేసి నష్టపోయారు.


Click it and Unblock the Notifications











