దీపావళికి ఈ స్టార్స్ మధ్యే పోటాపోటీ! (ఫొటో ఫీచర్)
చెన్నై : దీపావళి అంటేనే.. వెండితెర కొత్త అందాలతో వర్ణశోభితం అవుతుంది. ఆ పండుగకు సాధారణంగానే కళకళలాడే కోలీవుడ్.. ఈ సారి మరింత మెరుపులతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ సందడి చేసేందుకు వస్తుండగా.. విజయ్, విశాల్ సైతం సై అంటున్నారు. మరోవైపు 'తల' అజిత్ కూడా ఈ కనువిందు ఉత్సవంలో పాలుపంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కోలీవుడ్‌లో స్టార్ హీరోలందరూ వరుసకడితే.. దీపావళి 'వినోద' బాంబులు పేలినట్టే అంటున్నారు.
కోలీవుడ్‌లో అజిత్, విజయ్ మధ్య ఉన్న పోటీ అందరికీ తెలిసిందే. వీరి సినిమా విడుదల అవుతుందంటే చాలు అభిమానులకు పెద్దపండగే! కొన్నేళ్ల క్రితం అజిత్, విజయ్ చిత్రాలు పోటీగానే విడుదలయ్యేవి. ఒకేరోజున లేకపోతే.. వారం తేడాతో తెరపైకి వచ్చేవి. దీంతో అభిమానుల మధ్య కూడా పోటీ పెరిగింది. థియేటర్ల వద్ద అజిత్, విజయ్ చిత్రాలు ఏర్పాటు చేసి వారి అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేయడం కూడా పోటీగా మారింది.
ఓ దశలో భారీ కటౌట్లు మీరు కడతారా?.. మేం కడుతామా?.. అన్నట్టుగా కూడా పోటీ ఉండేది. దీంతో ఇద్దరూ తమ చిత్రాలను వేర్వేరు సమయాల్లో విడుదల చేయడం ఆరంభించారు. కానీ పాత పోటీకి మళ్లీ ఈ ఏడాదిన శ్రీకారం చుట్టారు. గత సంక్రాంతి రోజున ఇద్దరి చిత్రాలు విడుదలయ్యాయి. ఇప్పుడు మళ్లీ తలపడేందుకు సిద్దమవుతున్నారు. మొత్తానికి దీపావళికి ఎన్ని చిత్రాలు బరిలోకి దిగుతాయో.. ఏయే చిత్రాలు విజయబావుటా ఎగురవేస్తాయి వేచిచూడాల్సిందే.
స్లైడ్ షోలో... సినిమాల డిటేల్స్...

'లింగా'
స్త్టెల్, పంచ్ డైలాగులు, మాస్, కమర్షియల్.. రజనీకాంత్ చిత్రంలో ప్రతి ప్రేక్షకుడూ ఎదురుచూసే అంశాలివి. అయితే ఇటీవల విడుదలైన ఫొటో రియాలిస్టిక్ యానిమేషన్ చిత్రం 'కోచ్చడయాన్' ఆశించిన స్థాయిలో రజనీ అభిమానులను అలరించలేదు. రజనీ తదుపరి చిత్రం 'లింగా'పై అంచనాలు పెంచుకున్నారు. దీపావళి కానుకగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయని చెప్పారు కేఎస్ రవికుమార్. ఇందుకోసం బాణీలను త్వరగా సమకూర్చి ఇవ్వాలని ఏఆర్ రెహ్మాన్‌ను అడిగారట. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న రెహ్మాన్.. రజనీ సినిమాపై దృష్టి పెట్టినట్లు సమాచారం. మొత్తానికి సకల వినోదాలతో ఈ చిత్రం దీపావళికి పెద్ద బాణసంచాగా తెరపైకి రానుంది.

'పూజై'
కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హరి దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం 'పూజై'. విశాల్ హీరోగా నటిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'తామిరభరణి' మెగాహిట్‌గా నిలవడంతోపాటు.. విశాల్‌కు కెరీర్‌లో మలుపుగా మారింది. తనదైన మాస్ హంగులతో 'పూజై'ను తెరకెక్కిస్తున్నారు హరి. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్. ఇప్పటికే 50శాతం చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. యువన్‌శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నారు. సత్యరాజ్, కౌసల్య వంటి తారాగణంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దీపావళికి విడుదల చేయాలని నిర్ణయించుకుంది చిత్ర యూనిట్.

'కత్తి'
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలోని 'తుపాకి'తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు 'ఇలయ దళపతి' విజయ్. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కత్తి'. విజయ్‌కి ఉన్న మాస్ ఇమేజ్‌కు తగ్గట్టు శీర్షిక కూడా కుదరడంతో.. ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. విజయ్‌ని మరో కొత్త కోణంలో చూపించనున్నట్లు ఇప్పటికే మురుగదాస్ తెలిపారు. గతంలో వీరి కాంబినేషన్‌లోని 'తుపాకి' దీపావళికి విడుదలై పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. అదే సెంటిమెట్‌తో ఈసారి కూడా 'కత్తి'ని పదునెక్కించి దీపావళి కదనరంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు విజయ్.

అజిత్ వస్తారా?
'తల' అజిత్ దీపావళికి తప్పకుండా సందడి చేస్తారని నిన్నటి వరకు కోలీవుడ్‌లో పెద్దగా ప్రచారం సాగింది. గౌతంమీనన్ దర్శకత్వంలోని ఈ చిత్రం దీపావళికి వస్తుందని నిర్మాణవర్గాలు చెప్పాయి. తాజాగా దీనిపై గౌతంమీనన్ స్పందిస్తూ.. 'దీపావళికే అనుకున్నాం.. ట్రైచేస్తా'మని చెప్పారట. దీంతో తల దీపావళికి వస్తారో? రారోనన్న సందేహం తలెత్తింది.


Click it and Unblock the Notifications











