కమల్‌కు ఆశాభంగం... ‘విశ్వరూపం’పై మళ్లీ బ్యాన్
చెన్నై: మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ కోర్టు 'విశ్వరూపం' చిత్రంపై నిషేదం ఎత్తివేసిందనే ఆనందం కమల్ హాసన్‌కు ఎంతో సేపు మిగల లేదు. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం రివ్యూ పిటీషన్ దాఖలు చేయడంతో మద్రాస్ హైకోర్టు ధర్మాసనం వెంటనే స్పందించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ ఈ రోజు మధ్యాహ్నం ఆదేశాలు జారీ చేసింది. దీంతో 'విశ్వరూపం' చిత్రంపై బ్యాన్ పడ్డట్లయింది.
కమల్ హాసన్ ఫిబ్రవరి 4లోగా సినిమాపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి 6న మద్రాస్ హైకోర్టు నుంచి తుది తీర్పు వెలువడనుంది. మద్రాసు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కమల్ హాసన్ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు.
కాగా.....ఈ రోజు ఉదయం తమిళనాడు వ్యాప్తంగా థియేటర్లలో విశ్వరూపం సినిమా విడుదలకు రంగం సిద్ధం కాగా ఆందోళన కారులు రెచ్చి పోయారు. రామనాథ పురం జిల్లాలో రెండు చోట్ల దుండగులు పెట్రో బాంబులు విసిరారు. తమిళనాడు వ్యాప్తంగా 13 థియేటర్లను ధ్వంసం చేసారు. మరో వైపు నాగపట్నం, కోయంబత్తూర్ లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో పలు చోట్ల సినిమా ప్రదర్శనను నిలిపి వేసారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ముస్లిం సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపిన కమల్ హాసన్ సినిమాలో అభ్యంతర కరంగా ఉన్న సీన్లను కత్తిరించడానికి అంగీకరించారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు. విశ్వరూపం చిత్రం ఈ నెల 25న విడుదల కావాల్సి ఉండగా..... ముస్లిం సంఘాల ఫిర్యాదుతో తమిళనాడు ప్రభుత్వం ఆచిత్రంపై నిషేదం విధించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











