దట్టమైన అడవిలో 'రావణ్' ఆడియో రిలీజ్
దట్టమైన అడవిలో ఏఆర్ రెహమాన్ బృందం 'రావణ్' లోని 'ఉసురే తగిలి..ఉసురే తగిలి' పాట ఆలపించడంతో రావణ్ (తెలుగులో విలన్) ఆడియో రిలీజ్ అయింది. అయితే నిజానకి అది అడవి కాదు. రావణ్ సినిమా కథను పోలినట్టుగా వేదిక అరణ్యంలా తీర్చిదిద్దారు. ముందే ప్లాన్ చేసుకున్న అంకాలతో ఒక నాటకంలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నైలోని లేడీ ఆండాల్ స్కూల్ ఆడిటోరియంలో ఈ పంక్షన్ జరిగింది.
ఇక ఈ పంక్షన్ లో దర్శకుడు మణిరత్నం ఒక్కమాట కూడా మాట్లాడకనే ముసిముసిగా నవ్వుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ అభిమానులను ఆకట్టుకున్నారు. వ్యాఖ్యాతలు కార్తీక్, ప్రియమణి ఈసారి వేదిక మీద వచ్చి ఈ మొత్తం కార్యక్రమానికి 'రావణన్-ఫస్ట్‌లుక్' అని పేరుపెట్టి తొలిచూపులోనే రావణన్ తన ప్రోమోలు, పాటలతో ఆకట్టుకుంటాడని అన్నారు. అనంతరం ప్లే అయిన ప్రోమోలకు కార్తిక్, ప్రియమణి చెప్పినట్టుగానే ప్రేక్షకుల నుంచి భారీగా కరతాళధ్వనులతో స్పందన లభించింది.
"పది శిరస్సులు....పది మస్తిష్కాలు...వంద గొంతులు...ఒక్కడే మనిషి...రావణుడు నిజంగా ఉన్నాడా? అతడి పాత్ర ఒక మిధ్యా? లేకుంటే ఒక సంకేతమా? మంచికీ చెడుకూ మధ్య ఉన్న సన్నటి రేఖ పేరే రావణుడా? మనం రావణుడి వైపు నుంచి చూస్తే రావణుణ్ణి అర్థం చేసుకునే పద్థతి మారుతుందా? రావణుడిలో రాముడు ఉన్నాడా? లేదంటే రావణుడు మనందరిలో ఉన్నాడా?'....సినీ హీరో కార్తీక్ వ్యాఖ్యానించి ఈ చిత్రం గురించి చెప్పకనే చెప్పారు.
ఆ తర్వాత హీరో విక్రమ్ అదే సినిమాలోని 'కుళ్లు కుంటే...కుళ్లపొడిచెయ్' పాటకు తుపాను వేగంతో డాన్స్ చేసి ఆనందపరిచారు. మణిరత్నం దర్శకత్వంలో హిందీ, తమిళ భాషల్లో రూపొందిన రావణ్ చిత్రం తెలుగులో అనువాదమై జూన్ 18న విడుదలవుతోంది. విక్రమ్ హీరో ఐశ్వర్యా రాయ్ హీరోయిన్. ప్రభు, కార్తీక్, ప్రియమణి, మలయాళ హీరో పృధ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రధారులు. ఏఆర్ రెహమాన్ సంగీతం. సంతోష్ శివన్ ఫొటోగ్రఫీ. రావణన్ తెలుగు వెర్షన్ కోసం వేటూరి పాటలు రాయగా, మాటలు శ్రీరామకృష్ణ సమకూర్చారు. సోనీ మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.


Click it and Unblock the Notifications











